డెహ్రాడూన్: చమోలీ జిల్లా తపోవన్ ఏరియా రైనీ గ్రామం ఎగువన 4,200 మీటర్ల ఎత్తులో మంచు కరుగడంవల్ల ఏర్పడిన సరస్సును ఎస్‌డీఆర్ఎఫ్, ఎన్‌డీఆర్ఎఫ్...
డెహ్రాడూన్: చమోలీ జిల్లా తపోవన్ ఏరియా రైనీ గ్రామం ఎగువన 4,200 మీటర్ల ఎత్తులో మంచు కరుగడంవల్ల ఏర్పడిన సరస్సును ఎస్‌డీఆర్ఎఫ్, ఎన్‌డీఆర్ఎఫ్ బృందాలు పరిశీలించాయని, ఆ సరస్సు ప్రమాదకరమేమీ కాదని తేల్చాయని ఉత్తరాఖండ్ డీజీపీ అశోక్ కుమార్ తెలిపారు. సరస్సులో చేరుతున్న నీళ్లు ఎప్పటికప్పుడు కిందికి వెళ్లిపోతుండటంతో ఒకేసారి వరదలు వచ్చే ప్రమాదం లేదని వారు నిర్ధారించినట్లు చెప్పారు.
వరద ప్రభావిత ప్రాంతాల్లో పరిస్థితి క్రమంగా మెరుగుపడుతున్నదని, ముంపు గ్రామాల మధ్య కనెక్టిటివీ యథాస్థితికి చేరిందని, మరోవైపు బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ బెయిలీ వంతెనను పునఃర్నిర్మిస్తున్నదని ఉత్తరాఖండ్ డీజీపీ తెలిపారు. ఎస్‌డీఆర్ఎఫ్, ఐటీబీపీ పునరావాస కేంద్రాలు బాధిత ప్రజలకు నిత్యావసరాలు అందజేస్తున్నాయని, చమోలీ జిల్లా అధికార యంత్రాంగం కూడా బాధితులకు సహాయ, సహకారాలు అందిస్తున్నదని ఆయన చెప్పారు.
తపోవన్ దగ్గర చిన్న సొరంగంలో చెత్తను తొలగించేందుకు ఎన్‌టీపీసీ దాని దిగువ భాగంలో రంధ్రం చేస్తున్నదని డీజీపీ అశోక్ చెప్పారు. పెద్ద సొరంగంలో కూడా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతున్నదన్నారు. ఇదిలావుంటే శుక్రవారం మైథానా సమీపంలో ఒక మృతదేహం లభ్యం కావడంతో గాలింపును హరిద్వార్ వరకు పొడిగించామని ఆయన చెప్పారు.