Page Nav

HIDE

Grid

GRID_STYLE

Pages

latest

చత్రపతి శివాజీ మహారాజ్ జయంతి శుభాకాంక్షలు - About chatrapati shivaji maharaj in telugu

శివాజీ కాలంలో, అంతకు ముందు దేశంలో భయంకరమైన పరిస్థితు లుండేవి. సాధారణ ప్రజలు, సాధుసంతులు కూడ, ‘భగవంతుడా! పరిస్థితులు పరాకాష్ఠకు చేరు...


శివాజీ కాలంలో, అంతకు ముందు దేశంలో భయంకరమైన పరిస్థితు లుండేవి. సాధారణ ప్రజలు, సాధుసంతులు కూడ, ‘భగవంతుడా! పరిస్థితులు పరాకాష్ఠకు చేరుకొన్నాయి. మమ్మల్ని రక్షించండి’ అని మొరపెట్టు కొనవలసిన దుస్థితి. వివాహమై భర్త వెంట బయలు దేరిన భార్య, అత్త వారింటికి క్షేమంగా చేరు తుందని నమ్మకం లేదు. ఎవరి ధర్మం వారు ఆచరించే స్వేచ్ఛ లేనేలేదు. బానిసరాజుల కాలం నుంచి, అప్పటి మొగలుల వరకు విధర్మీయుల క్రూరత్వాలు వందల ఏళ్లు కొనసాగాయి. భోంస్లే వంశీయుడు, శివాజీ కన్నతండ్రి శహజీ. ఆయన గొప్ప సర్దారు. అలాంటి వీరుడు కూడా గర్భిణియైన భార్యను రక్షించుకోడానికి అడవులకు పరుగెత్తాల్సి వచ్చింది. ఇలాంటి పరిస్థితులలో శివనేరి దుర్గంలో జిజా మాత గర్భాన శివాజీ (ఫిబ్రవరి 19, 1630 – ఏప్రిల్‌ 3,1680) జన్మించాడు. శహజీకి పట్టిన దుర్దశ సూచించేదేమిటి? గొప్ప గొప్ప సర్దారులు కూడా విధర్మీయుల హింస నుండి తప్పించుకోలేక పోయారు. కొందరు రాజులు, సర్దారులు బాద్‌షాకు సలాములు చేస్తూ బతికేశారు. ఇక సాధారణ ప్రజల పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు.

తలవంచని బాల శివాజీ
ఎనిమిదేళ్ల శివాజీని తండ్రి శహాజీ తనతో బాటు బీజాపూర్‌ కొలువుకు తీసుకెళ్లాడు. తండ్రి చెప్పినా సుల్తాన్‌కు సలాం చేయకుండా చిరుప్రాయం లోనే విదేశీ ప్రభువుకు తలవంచరాదనే ఆదర్శాన్ని ప్రపంచం ముందుంచాడు. అయితే బాల్యంలో ఏ సుల్తాన్‌ ముందర తలవంచలేదో, అదే బీజాపూర్‌ సుల్తాన్‌ భవిష్యత్‌లో స్వతంత్ర హిందూ సామ్రాజ్యాధి పతి ¬దాలో శివాజీని బీజాపూర్‌కు ఆహ్వనించాడు. సుల్తాన్‌ సింహాసనం నుండి దిగి శివాజీ వద్దకు వచ్చి తలవంచి నమస్కరించాడు. ఏ కాలంలో అయినా ఒకనాడు తనను తిరస్కరించిన వారిని తన ముందు మోకరిల్ల చేయడమే అసలైన రాజనీతి.

రణనీతి కోవిదుడు
నిరుపేదలే అయినా స్వాభిమానం కలిగిన మరాఠా యువకులను ఐక్యం చేసి అధర్మంపై విజయం సాధించి, హిందూ సామ్రాజ్యాన్ని స్థాపించాడు శివాజీ. తండ్రి మద్దతు కూడా లేని పరిస్థితి నుంచి మొదలుపెట్టి మూడు వందల కోటలు గెలిచారాయన. ఇంత గొప్ప కార్యాన్నెలా చేయగలిగాడు? గెలుపోటములు ఆయన జీవితం లోనూ ఉన్నాయి. యుద్ధనీతి గురించి సంపూర్ణంగా తెలుసు. అయినప్పటికీ యుద్ధం వదలి పారిపో వలసిన పరిస్థితి కూడా వచ్చింది. కానీ యుక్తి, వ్యూహంతో ఆయన సాధించాడు. మహాబల వంతుడైన సయిస్థఖాన్‌ యుద్ధానికి వచ్చినప్పుడు శివాజీ కూడ పారిపోయాడు. ఖాన్‌ ఆశ్చర్యపోయాడు. తర్వాత తృటిలో తప్పించుకొని కొడుకు శవాన్ని కూడ తీసుకొని పోకుండా పారిపోయాడు. భవిష్యత్‌లో దక్షిణంవైపు తిరిగి చూసే సాహసం చేయలేదు.

అంతిమ విజయమే లక్ష్యం
శివాజీ, సయిస్థఖాన్‌లలో పారిపోయిందెవరు? చిట్టచివరకు యుద్ధ మైదానాన్ని వదలింది ఎవరు? ఆక్రమణ ఎప్పుడు చేయాలి? ఎప్పుడు తప్పుకోవాలి? బాగా ఎరిగినవాడు శివాజీ. శత్రువు బలవంతుడు. కానీ దుండగీడు. అందుకే ఆయన గెరిల్లా యుద్ధ పోకడలను ఎంచుకున్నాడు.శివాజీ తన ఎత్తుగడలన్నీ క్షేత్ర ప్రవృత్తికి ఎంత విరుద్ధమైనవైనా ఆలోచించ కుండా ఆచరించినవి కావు. ధర్మం గెలవాలి. ఈ విషయంలో పాపపుణ్యాల ప్రసక్తే లేదని శివాజీ నమ్మేవారు.

శివాజీ మీదకు యుద్ధానికి అప్జల్‌ఖాన్‌ పెద్ద సైన్యంతో బయలుదేరాడు. శివాజీ దగ్గర తగినంత సైన్యం, యుద్ధ సామాగ్రి లేవు. అయితేనేం, ఎలాగైనా గెలవాలి. అందుకు అనువైన స్థలం ప్రతాప్‌గడ్‌. అప్జల్‌ఖాన్‌ ఎంత కవ్వించినా కదలకుండా శివాజీ ఇక్కడే మకాం వేసి శత్రువుని రప్పించాలని ఎదురు చూస్తున్నాడు. శివాజీనీ మైదాన ప్రాంతానికి రప్పించాలని మందిరాలను, పంట పొలాలను నాశనం చేశాడు అఫ్జల్‌. చివరి అస్త్రంగా ప్రజలపై అత్యాచారాలు పెంచాడు. ప్రజలు శివాజీ దగ్గరకు వచ్చి విన్నవించుకొన్నారు. శివాజీకి దేశధర్మాల పట్ల ప్రేమ లేదని ప్రజలకనిపించి ఉండవచ్చు. చిట్టచివరకు అప్జల్‌ఖాన్‌ను ప్రతాప్‌గడ్‌కు రప్పించి వధించాడు.

ఔరంగజేబుని మూర్ఖుని చేసాడు
ఢిల్లీలో కూడ హిందూ సామ్రాజ్యాన్ని స్థాపించా లని సాహసోపేతమైన పథకాన్ని పన్ని, అక్కడికే వెళ్లాడు శివాజీ. శివాజీని చూడగానే భయకంపితుడైన ఔరంగజేబు స్నానాలగదిలో దాక్కొన్నాడు. లేకుంటే అప్జల్‌ఖాన్‌కు పట్టినగతే పట్టి ఉండేది. కానీ శివాజీ దొరికిపోయాడు. అయినా ఔరంగజేబును మూర్ఖుని గావించి ఢిల్లీ నుండి మహారాష్ట్రకు క్షేమంగా చేరాడు. శివాజీ సృష్టించిన ఈ సాహసోపేతమైన మెరుపు దేశమంతటా వ్యాపించింది.

గురుగోవిందుని ఆశ
కుటిల నీతితో తమ సామ్రాజ్యాన్ని విస్తరించు కొనేందుకు శత్రువులు గురుగోవిందునికి నాలుగువైపులా ఆవరించి ఉన్న సమయం. వాతావరణం వేడెక్కి ఉంది. గురుగోవిందుని అందరు కుమారులు, శిష్యులు శత్రువుల అత్యాచారాలకు బలి అయ్యారు. సర్వత్రా నిరాశ, భయం. ఈ పరిస్థితులలో మెరుపువలె ఢిల్లీ వచ్చి వెళ్లిన శివాజీని కలవాలను కొన్నాడు. సహాయం చేయగలడని భావించి దక్షిణానికి బయల్దేరాడు. దురదృష్టమేమో గాని ఇద్దరు మహాపురుషులు కలుసుకోలేకపోయారు. గురు గోవిందుడు మహారాష్ట్రలో అడుగుపెట్టే సమయానికే శివాజీ మరణించాడు.

ఛత్రసాల్‌కు ప్రేరణ
మొగలులతో సుదీర్ఘ పోరాటం జరుపుతూ, ముస్లింల అత్యాచారాలతో భారత భవిష్యత్‌ ఏమవు తుందోనన్న బెంగతో చంపతరాయ్‌ మృత్యుశయ్యపై ఉన్నాడు. ఎలాగైనా దేశం కాపాడబడాలని భావించి కొడుకు ఛత్రసాల్‌తో, ‘శివాజీ దగ్గరకెళ్లి యుద్ధ తంత్రాన్ని నేర్చుకో, తప్పక విజయం లభిస్తుంది’ అని చెప్పాడు. ఆ ప్రకారంగా శివాజీ దద్గర యుద్ధ మంత్రాన్ని నేర్చుకొని వెళ్లి తన రాజ్యాన్ని కాపాడు కొన్నాడు. అంటే శివాజీ స్ఫూర్తి సార్వకాలికం.

శిష్యునికి గురువు ప్రశంస
సమర్థరామదాసు మహారాష్ట్ర అంతటా పర్యటిస్తూ హిందూ ధర్మ ప్రచారం చేస్తుండేవారు. తద్వారా హిందువులలో ఐక్యతను నిర్మాణం చేసాడు. ఈ ఐక్యత ఆధారంగా ముస్లిం దురాక్రమణదారులను హిందువులు తిప్పికొడతారని ఆయన విశ్వసించాడు. ఈ ఐక్యతా మంత్రం బాగా పనిచేసింది. తన వంటి సాధువులతో బాటు ప్రజలందరు ఐక్యతా మంత్రాన్ని ఉపాసించారు. ఈ ఐక్యత నుండే హిందూ సమాజానికి శివాజీ నాయకత్వం లభించింది. హిందూ రాజ్యస్థాపన జరిగింది. సమర్థ రామదాసుకు ఆనందం వేసింది. 1672లో శివాజీ కీర్తి శిఖరాయ మానమైంది. అప్పుడు శివాజీని ప్రశంసిస్తు ఆయన లేఖ వ్రాశారు. శివాజీ దృఢ నిశ్చయం హిమాలయ సదృశం. హిందూ సమాజానికి మూలాధారం అన్నారు. శివాజీకి గురువుగా సమర్థరామదాసు మార్గదర్శనం చేసారు.

సాధారణంగా శిష్యుడు గురువును ప్రశంసి స్తుంటాడు. అయితే గురువే శిష్యుని ప్రశంసించే అవకాశం శివాజీ ఆదర్శ గుణాల కారణంగా సమర్థ రామదాసుకు లభించింది. శివాజీ మరణానంతరం అతని కుమారుడు శంభాజీకి ఉపదేశం చేస్తు ‘శివాజీ మహారాజును స్మరించు. అతని మాట, వ్యవహారం, ఉద్దేశం, ప్రయత్నం వంటి గుణాలను స్మరించు. వాటి నుండి విజయశాలి పురుషుడు ఎలా ఉండాలనేది నీకు అర్థం అవుతుంది’ అని అన్నారు.

శివాజీ మరణించడానికి ముందు కూడ సమర్థరామదాసు శిష్యుని ప్రశంసిస్తు శంభాజీకి రాసిన ఉత్తరంలో ఈ మాటలు ఉన్నాయి, ‘మీరు ఉన్నారు కాబట్టే ధర్మం మిగిలి ఉన్నది. మా లాంటి వారు కేవలం ఈశ్వరుని పూజ- భజన – జపం – తపస్సు వంటివి కాకుండా ఇంకేమీ చేయడం లేదు. మీరు కనుక లేనట్లయితే ధర్మం రక్షణ జరుగు తుందన్న ఆశ ఉండేది కాదు.’

మరుగు పరిచే ప్రయత్నాలు
కొందరు పెద్దలు వివిధ రకాల భ్రమలతో ఈ మహాపురుషుని నిర్లక్ష్యం చేస్తుంటారు. గడచిన 1200 సం||ల నుండి ఒక దురాక్రమణ జాతికి, ఈ భూమి సంతానమైన హిందువులకు మధ్య జరిగిన నిరంతర పోరాటాన్ని మరచిపోయాం. ఆ కారణంగా జాతి వ్యతిరేక శక్తులను కౌగలించుకోవడానికి వారు విఫలయత్నం చేస్తున్నారు. శివాజీ జయంతి ఉత్సవాలను తిలక్‌ ప్రారంభించారు. తిలక్‌ తర్వాత జాతీయ కాంగ్రెస్‌ పగ్గాలు చేపట్టిన నాయకులు బుద్ధి పూర్వకంగానే ప్రజలు శివాజీని మరచిపోయేట్లు చేసారు. అయినప్పటికీ ఆ మహానుభావుడి ప్రభావం ప్రజల గుండెల్లో నుండి రవ్వంత కూడా తొలగలేదు. సామ్యవాదుల్లోని కొందరు విద్వాంసులు శివాజీ గురించి వారి పత్రికల్లో వ్యాసాలు వ్రాస్తూ అతనిని ధర్మస్థాపకుడిగా కాకుండా సామ్యవాదియైన విప్లవ కారుడిగా ఆవిష్కరించే ప్రయత్నాలు చేసారు. శివాజీ రైతులను ఐక్యపరచాడనేది వాస్తవం. అయితే 19వ శతాబ్దపు కార్ల్‌మార్ట్క్‌ పుస్తకం చదివి 17వ శతాబ్దపు శివాజీ వర్గపోరాటం కల్పనతో సామ్యవాద పోరాటం చేసారని సూచించడం హాస్యాస్పదం. శివాజీకి సంబంధించిన ఏ విషయం రహస్యం కాదు. కాబట్టి ఈ గొప్ప వ్యక్తి ప్రఖర తేజస్సును తగ్గించ డానికి ఈ విధమైన భ్రమలు కల్పిస్తూ ప్రచారం చేస్తున్నారు.

మూర్ఖుడెవరైనా కళ్లుమూసుకొని సూర్యుడు లేేడని అన్నప్పటికీ కాళ్లక్రింద వేడెక్కినప్పుడు సూర్యుడున్నట్లు గ్రహిస్తారు. అలాగే శివాజీ తేజస్సును మరిపింపచేసే ప్రయత్నం ఎవరు చేసినా సాగదు. చరిత్రలో ఆయన స్థానాన్ని ప్రతి తరానికి తెలియచేయడానికి ఒక గొప్ప స్ఫూర్తి ఇప్పటికీ మిగిలి ఉంది. అందువలన శివాజీని పదవీ భ్రష్టుడైన నేత అని, మొగల్‌ సామ్రాజ్యానికి బద్ధ్ద వ్యతిరేకియని, ఒక మతానికి శత్రువు అని ఆరోపించే వారు కూడా సర్వత్రా అంధకారమే అలుముకున్నప్పుడు శివాజీ గాథను స్మరించుకోకపోతే దేశాభివృద్ధి అసంభవం అనక తప్పదు. సుమారు 350 ఏళ్ల తర్వాత కూడా భ్రమలతో కూడిన నేటి తరాన్ని కొరడా ఝళిపించి, పెను నిద్దుర వదిలించి అప్రమత్తం గావించే శక్తి శివాజీ చరిత్రకు ఉంది.

శివాజీ మీద దొంగ సెక్యులరిస్టులు కల్పిస్తున్న భ్రమలు క్రమంగా తొలగుతున్నాయి. దేశ నాయకులు అప్రమత్తం కావడం ప్రారంభమైంది. ప్రతి సంకట సమయంలో, ప్రతి పరీక్షా సమయంలో ఒక మార్గదర్శకుడు అవసరం. శివాజీ అలాంటి మార్గదర్శకుడు. ప్రజాజీవనంలో పనిచేసే వివిధ వ్యక్తులకు ఆయనొక కరదీపిక. తన కాలం నాటి పరిస్థితుల పట్ల అవగాహన చేసుకోవడంలో, వాటిని తట్టుకోవడంలో, నిర్ణయాలు తీసుకోవడంలో, అమలు చేయడంలో శివాజీ విలక్షణంగా వ్యవహరించారు. వ్యక్తిగత ఇష్టాలకతీతంగా నిర్ణయాలుండేవి. ఒకానొక దశలో ఆయన వద్ద 300 కోటులుండేవి. కాని ఒక్కకోటకు కూడా ఆయన బంధువులను అధిపతిగా నియమించ లేదు. ఇది నేటి పరిస్థితులలో వింతగానే ఉంటుంది.

శివాజీని స్మరిద్దాం
ఢిల్లీశ్వరోవా జగదీశ్వరోవా అని పిలిపించుకొనే మొగలు సింహాసనానికి ప్రతి ద్వంద్విగా హిందూ సామ్రాజ్య సింహాసనాన్ని 1674 సం|| జ్యేష్ఠ త్రయోదశి రోజున శివాజీ అధిష్టించాడు. దేశ వర్తమాన నిరాశామయ పరిస్థితులలో శివాజీ ఒక దీపస్తంభంలాగా నిలబడ్డారు. ఈ వెలుగులోనే ప్రతి భారతీయ తరం దారి వెతుక్కోవాలి. ఆ మహనీయుని మరల మరల స్మరించాలి. అంతేకాని ఆయనను మనిషి స్థాయికి మించి భగవంతునిగా స్మరించరాదు. మనసులోనే శివాజీ మహారాజుతో మీలాంటి గుణాలను మాలో కూడ కలిగించమని మనం అడగాలి. మీరు చూపిన ఆదర్శాన్ని మా ముందు ఉంచుకొని భయంకరమైన పరిస్థితులను ఓడించి మేము విజయం పొందుతాం. ఇప్పుడే కాదు భవిష్యత్తులో కూడ శత్రువు మనపై ఆక్రమణ చేస్తే- ఆ శత్రువును ఓడించే అభేద్యమైన కవచాన్ని ఈ దేశంలో నిర్మిద్దాం. ఇది మన నిశ్చయం.

శివాజీ జీవితమంతా ఇక్కట్లతో, గెలుపోట ములతో నిండి ఉంటుంది. కానీ రాజ్యాభిషేకం మాత్రం పెద్ద ఎత్తున జరిగినది. ఎందుకు? భారతదేశంలో దురాక్రమణ చేసి రాజ్యాన్ని స్థాపించిన విదేశీయులు హిందువులను చులనకనగా చూశారు. అలాంటి దురహంకారులకు హిందువులు సవాలు విసిరి రాజ్యస్థాపన చేయగలుగుతారని చాటి చెప్పడమే శివాజీ రాజ్యాభిషేకం వెనుక ఉద్దేశం. స్వదేశీ, విదేశీ పాలకులు కూడ హిందూ సామ్రాట్టు ముందు తలవంచవలసి ఉంటుందని శివాజీ రాజ్యాభిషేకం నిరూపించింది.శివాజీ నిర్మించిన సామ్రాజ్యం పరపీడన మీద యుద్ధం ప్రకటించింది. తుదివరకు పోరాడింది. హిందూ సమాజంలో ఆత్మవిశ్వాసం పెల్లుబికింది. ఈ నేపథ్యంలో ఆర్‌.ఎస్‌.ఎస్‌. సంస్థాపకులు డాక్టర్‌ హెడ్గేవార్‌ శివాజీ పట్టాభిషేక ఉత్సవాన్ని సామాజిక ఉత్సవంగా జరిపే సంప్రదాయాన్ని ప్రారంభించారు. ఈ మ¬ద్య మంలో శివాజీ పాటించిన సత్యనిష్టను, త్యాగనిరతని కూడా మనం అలవాటు చేసుకోవాలి.