Page Nav

HIDE

Grid

GRID_STYLE

Pages

latest

జగన్ ప్రభుత్వానికి మళ్లీ చుక్కెదురు - vandebharath

కోర్ట్ ఆదేశాలను సహితం ఖాతరు చేయని వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వానికి రాష్ట్ర హై కోర్ట్ నుండి వరుసగా ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. త...


కోర్ట్ ఆదేశాలను సహితం ఖాతరు చేయని వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వానికి రాష్ట్ర హై కోర్ట్ నుండి వరుసగా ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. తాజాగా  పంచాయతీ భవనాలకు వైసీపీ జెండా రంగులు వేస్తున్న వ్యవహారంలో ‌ ప్రభుత్వానికి మళ్లీ చుక్కెదురైంది.

ప్రభుత్వ భవనాలకు వైసీపీ పతాకానికి చెందిన ఆకుపచ్చ, నీలం, తెలుపు రంగులతో పాటు ఎర్రమట్టి రంగు కూడా అదనంగా వేయాలంటూ రాష్ట్రప్రభుత్వం తాజాగా జారీ చేసిన జీవో 623ని తదుపరి విచారణ వరకు హైకోర్టు సస్పెండ్‌ చేసింది. విచారణను ఈ నెల 19వ తేదీకి వాయిదా వేసింది.

అంతేగాక రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్‌) వైఖరిపైనా అసంతృప్తి వ్యక్తం చేసింది. ప్రభుత్వ భవనాలకు పార్టీల రంగులు వద్దని గతంలో తామిచ్చిన ఆదేశాలకు విరుద్ధంగా మళ్లీ రాజకీయ పార్టీ రంగుల్ని పోలిన రంగులే వేయడాన్ని కోర్టు ధిక్కరణగా ఎందుకు పరిగణించరాదో చెప్పాలని ఆదేశించింది. జీవో 623 జారీకి సంబంధించి పూర్తి వివరణతో కౌంటర్‌ దాఖలు చేయాలని నిర్దేశించింది.

ఈ మేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ జేకే మహేశ్వరి, న్యాయమూర్తి జస్టిస్‌ కె.లలితతో కూడిన ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. పంచాయతీ భవనాలకు రంగులపై హైకోర్టు స్పష్టమైన ఆదేశాలిచ్చినా రాష్ట్ర ప్రభుత్వం మళ్లీ పాత వైఖరితోనే రంగులేసేందుకు అనువుగా జీవో 623 జారీ చేసిందని పేర్కొంటూ గుంటూరు జిల్లా అంగలకుదురుకు చెందిన రైతు సూర్యదేవర వెంకటరావు హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేయగా మంగళవారం దానిపై ధర్మాసనం విచారణ జరిపింది.

ఈ సందర్భంగా పిటిషనర్‌ తరఫు న్యాయవాది పాణిని సోమయాజి వాదనలు వినిపించారు. ప్రభుత్వ భవనాలకు వైసీపీ పతాక రంగులు వేయడానికి వీల్లేదని గతంలో హైకోర్టు స్పష్టమైన ఆదేశాలిచ్చిందని, అయినా రాష్ట్రప్రభుత్వం ఆ ఆదేశాలను బేఖాతరు చేసి అవే రంగులతో పాటు కొత్తగా ఎర్రమట్టి రంగు వేసేందుకు అనువుగా జీవో జారీ చేసిందని తెలిపారు. ఇది కోర్టు తీర్పు ఉల్లంఘన కిందకే వస్తుందని పేర్కొన్నారు. ప్రభుత్వ చర్య స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీకి ప్రయోజనం చేకూర్చేలా ఉందని పేర్కొన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం తరఫున అదనపు అడ్వకేట్‌ జనరల్‌ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. ప్రభుత్వం ఖరారు చేసిన రంగులకు, రాజకీయ పార్టీలకు ఎలాంటి సంబంధం లేదని.. హైకోర్టు ఆదేశాల మేరకే ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. ఇరువర్గాల వాదనలను పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం.. ప్రభుత్వం చెప్పదలచుకున్న వివరాలను కౌంటర్‌ అఫిడవిట్‌ రూపంలో దాఖలు చేయాలని ఆదేశించింది.