Page Nav

HIDE

Grid

GRID_STYLE

Pages

latest

ఆర్ధిక పరిస్తితి నుండి బయటపడటానికి ఏడాది పైన పడుతుందా?

  కరోనా నష్టాల నుంచి దేశ ఆర్థిక వ్యవస్థ కోలుకుని నిలబడేందుకు ఏడాదికిపైగానే సమయం పడుతుందని 45 శాతం మంది సీఈవోలు భావిస్తున్నారు. దాదాపు 3...

 
కరోనా నష్టాల నుంచి దేశ ఆర్థిక వ్యవస్థ కోలుకుని నిలబడేందుకు ఏడాదికిపైగానే సమయం పడుతుందని 45 శాతం మంది సీఈవోలు భావిస్తున్నారు. దాదాపు 36.5 శాతం మంది 6 నుంచి 12 నెలలు పట్టవచ్చని అంటుండగా, సుమారు 17 శాతం మంది 3 నుంచి 6 నెలల్లో కోలుకుంటామన్న ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నట్లు సీఐఐ తెలిపింది. అయినప్పటికీ కరోనా, లాక్‌డౌన్‌ పరిణామాలతో దేశంలో దీర్ఘకాల ఆర్థిక మందగమనం చోటు చేసుకుందని మెజారిటీ సీఈవోలు స్పష్టం చేశారు.

అందుకే లాక్‌డౌన్‌ ముగిసిన ఏడాది తర్వాతగానీ వృద్ధికి అవకాశం లేదని స్పష్టం చేస్తున్నారు. దేశవ్యాప్తంగా 300 మందికిపైగా సీఈవోలు తాజా సర్వేలో పాల్గొన్నారు. వీరిలో దాదాపు మూడింటా రెండు వంతుల మంది సూక్ష్మ, చిన్న, మధ్యతరహా సంస్థ (ఎంఎస్‌ఎంఈ)లకు చెందినవారే.
లాక్‌డౌన్‌తో ఉత్పాదక రంగం పూర్తిగా మూతబడింది. మార్కెట్‌ డిమాండ్‌కు తగ్గట్లుగా ఉత్పత్తి లేదని, దీనివల్ల భవిష్యత్‌ వ్యాపారం ప్రభావితం అయ్యే వీలుందని చాలా సంస్థలు ఈ సందర్భంగా ఆందోళన వెలిబుచ్చాయి. ఆదాయం సరిపడా లేక ప్రజల్లో కొనుగోళ్ల శక్తి కూడా మందగించే అవకాశాలున్నాయని ప్రతీ నాలుగు సంస్థల్లో మూడు అభిప్రాయపడ్డాయి.

ఈ క్రమంలోనే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో 40 శాతానికిపైగా ఆదాయం కోల్పోతామని 33 శాతం సంస్థలు అంటుంటే.. 20 నుంచి 40 శాతం నష్టపోవచ్చని దాదాపు 32 శాతం సంస్థలు అంచనా వేస్తున్నాయి.
వ్యాపారం స్తంభించి, ఆదాయం కోల్పోయిన సంస్థలు.. వ్యయ నియంత్రణ చర్యలకు దిగడం ఖాయంగా కనిపిస్తున్నది. అందుకే లాక్‌డౌన్‌ తర్వాత ఉద్యోగాల్లో కోతలు తప్పవన్న అభిప్రాయాలు సీఐఐ సర్వేలో వినిపించాయి. సగానికిపైగా సంస్థలు ఉద్యోగులను తొలగిస్తామనే చెప్పడం గమనార్హం. ఇందులో 45 శాతం సంస్థలు 15 నుంచి 30 శాతం ఉద్యోగులను తీసేస్తామని స్పష్టం చేశాయి.

కరోనా వైరస్‌ అంతానికి లాక్‌డౌన్‌ ఒక్కటే మార్గమని, ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రాణాల కంటే ఏదీ ముఖ్యం కాదని సీఐఐ డైరెక్టర్‌ జనరల్‌ చంద్రజిత్‌ బెనర్జీ పేర్కొన్నారు. అయితే ఆర్థికంగా కుప్పకూలిన వ్యాపార, పారిశ్రామిక రంగాలు ఉద్దీపనల కోసం ఎదురుచూస్తున్నాయని చెప్పారు. అలాగే వ్యాపారానికి వీలున్న ప్రాంతాలు, పరిశ్రమలున్న జిల్లాల్లో లాక్‌డౌన్‌ను సడలించాల్సిన అవసరం ఉందని కూడా సీఐఐ అభిప్రాయపడింది.