ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి ఒకేరోజున రెండు అగ్ర దేశాధినేతలు విడివిడిగా ఫోన్ చేసి ద్వైపాక్షిక అంశాలపై సమాలోచనలు జరిపారు. అమెరికా అధ్యక్షుడు ...
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి ఒకేరోజున రెండు అగ్ర దేశాధినేతలు విడివిడిగా ఫోన్ చేసి ద్వైపాక్షిక అంశాలపై సమాలోచనలు జరిపారు. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఒకరి తర్వాత మరొకరు ఫోన్ చేసారు.
డొనాల్డ్ ట్రంప్ మోడీకి ఫోన్ చేసి ,మాట్లాడినట్లు వైట్ హౌస్ వర్గాలు నిర్ధారించాయి. ఇరు నేతల మధ్యా వాణిజ్యలోటు తగ్గించడం, ఆఫ్గనిస్థాన్ లో నెలకొన్న పరిస్థితి వంటి కీలక అంశాలపై చర్చలు జరిగినట్టు పేర్కొన్నారు. నూతన సంవత్సరంలో ఇరు దేశాల మధ్య ఉన్న వ్యూహాత్మక బంధాన్ని బలోపేతం చేసుకోవాలని నేతలు నిర్ణయించారు.
ఇండియా, అమెరికా మధ్య ఉన్న వాణిజ్యలోటును తగ్గించడానికి తీసుకోవాల్సిన చర్యలపైనా వారు చర్చలు జరిపారు. ఇండో-పసిఫిక్ రీజియన్ లో శాంతి, ఆఫ్గన్ కు సహకారం తదితర అంశాలపైనా వారు మాట్లాడుకున్నారని వైట్ హౌస్ ఓ ప్రకటనలో తెలిపింది.
అయితే, ఇండియా నుంచి దిగుమతి అయ్యే ఉక్కు, అల్యూమినియం ఉత్పత్తులపై ట్రంప్ సుంకాలను పెంచిన తరువాత, ఇరు దేశాల మధ్య వాణిజ్య యుద్ధ భయాలు నెలకొన్న విషయం తెలిసిందే. ఇదే సమయంలో భారత్ దీటుగా స్పందించింది. జనవరిలోగా పెంచిన సుంకాలను తగ్గించకుంటే తామూ ప్రతీకార సుంకాలను వేస్తామని హెచ్చరించిన నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఫోన్ చేయడం గమనార్హం.
మరోవంక, భారత్-రష్యా దేశాల మధ్య ద్వైపాక్షిక సహకారాన్ని ఇచ్చిపుచ్చుకోవడంతోపాటు, టెర్రరిజం, అంతర్జాతీయంగా నెలకొన్న పలు సమస్యల పరిష్కారంలో ముందడుగు వేసేందుకు భారత ప్రధాని నరేంద్ర మోదీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ నిర్ణయించారు.
ఈ మేరకు వారిద్దరూ టెలిఫోన్ ద్వారా సంభాషించినట్టు ఉభయ దేశాల దౌత్యవర్గాలు తెలిపాయి. ఈ ఏడాది భారత్‌లో జరుగనున్న పార్లమెంటు ఎన్నికల్లో నరేంద్ర మోదీ విజయం సాధించాలని రష్యా అధ్యక్షుడు అభిలషించినట్టు ఆ వర్గాలు పేర్కొన్నాయి. అంతర్జాతీయంగా ఆందోళన కలిగిస్తున్న ఉగ్రవాదంపై సమష్టిగా పోరాడేందుకు, ప్రపంచవ్యాప్తంగా అపరిష్కృతంగా ఉన్న పలు సమస్యల పరిష్కారానికి పరస్పర సహకారాన్ని అందిపుచ్చుకోవాలని ఇరు దేశాల నేతలు ఒక అంగీకారానికి వచ్చినట్టు ఆ వర్గాలు తెలిపాయి.
ప్రధానంగా ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సహకారంతోపాటు, అంతర్జాతీయంగా నెలకొన్న పలు కీలక అంశాలపై మోదీ, పుతిన్ దృష్టి సారించినట్టు ఆ వర్గాలు పేర్కొన్నాయి. ఈ ఏడాది సెప్టెంబర్‌లో వ్లాడివోస్టాక్‌లో నిర్వహించే ఈస్టర్న్ ఎకనామిక్ ఫోరమ్‌లో పాల్గొనాలని భారత ప్రధాని మోదీని రష్యా అధ్యక్షుడు పుతిన్ ఆహ్వానించినట్టు ఆ వర్గాలు తెలిపాయి. ఈ సందర్భంగా ఇరు దేశాల నేతలు ఒకరికొకరు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుకున్నట్టు ఆ వర్గాలు స్పష్టం చేశాయి.