Page Nav

HIDE

Grid

GRID_STYLE

Pages

latest

10% రిజర్వేషన్ అస్త్రంతో దిక్కుతోచని ప్రతిపక్షాలు

మరో మూడు నెలల్లో లోక్‌సభ ఎన్నికలు జరుగనున్న సమయంలో ఇప్పటి వరకు రిజర్వేషన్ పక్రియలోకి రాని పేదలకు విద్య, ఉద్యోగాల్లో 10 శాతం రిజర్వేషన్లు కల్...

మరో మూడు నెలల్లో లోక్‌సభ ఎన్నికలు జరుగనున్న సమయంలో ఇప్పటి వరకు రిజర్వేషన్ పక్రియలోకి రాని పేదలకు విద్య, ఉద్యోగాల్లో 10 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలపడం ద్వారా ప్రధాని ఒక బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించినట్లు అయింది. దానితో వచ్చే ఎన్నికలలో మోడీని ఎదుర్కోవడం కోసం మహాకూటమి ఏర్పాటు చేసే ప్రయత్నాలు ఒక వంక ముందుకు సాగక పోతుండగా, ఇప్పుడు ఈ అస్త్రంతో ప్రజలని మోదీకి వ్యతిరేకంగా సమీకరించడం అసాధ్యం కాగల సూచనలు కనిపిస్తున్నాయి.

కేవలం ఎన్నికల కోసం ఈ నిర్ణయం తీసుకున్నారని ప్రభుత్వంపై ప్రతిపక్షాలు దుమ్మెత్తి పోస్తున్నా ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించలేని నిస్సహాయ స్థితిలో చిక్కుకున్నాయి. ప్రస్తుతం జనరల్‌ కోటాగా ఉన్న 50 శాతం నుంచే మరో పది శాతాన్ని పక్కకు తీసి ఈ రిజర్వేషన్లు కల్పిస్తారు. అంటే బీసీ, ఎస్సీ, ఎస్టీల రిజర్వేషన్లలో మార్పు ఉండదు. దానితో ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించే కారణాలు కనిపించడం లేదు. పైగా దశాబ్దాలుగా ఇటువంటి డిమాండ్ పలు వర్గాల నుండి ఎదురవుతున్నది. దేశంలో దాదాపుగా అన్ని రాజకీయ పార్టీలు వివిధ సందర్భాలలో ఇటువంటి డిమాండ్లు చేశాయి.
అందుకనే ఈ నిర్ణయాన్ని అందరికన్నా మొదటగా కేరళ ముఖ్యమంత్రి పునరాయి విజయం సిపిఎం తరపున అంటూ మద్దతు తెలుపవలసి వచ్చింది. ఈ నిర్ణయాన్ని తప్పు బడుతూనే కాంగ్రెస్ మద్దతు తెలుపవలసి వచ్చింది. ఇక బీఎస్పీ ఉత్తర ప్రదేశ్ లో అధికారమలో ఉన్నప్పుడు ఇటువంటి డిమాండ్ చేసింది. 2014 ఎన్నికల సమయంలో ఎస్పీ ఇటువంటి హామీ ఇచ్చింది. ఈ నిర్ణయం రాజకీయంగా మాస్టర్ స్ట్రోక్ అని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.
చట్టపరంగా ఇబ్బందులు ఉంటాయని తెలిసినప్పటికీ వివిధ వర్గాల పేదలకు రిజర్వేషన్లు కల్పిస్తున్నట్టు మోదీ  ప్రకటించింది. ఈ రిజర్వేషన్ల కల్పనకు కులం ప్రాతిపదిక కాకపోవడం గమనార్హం. ఆర్థికంగా వెనుకబడిన వర్గాల పేరుతో అగ్రవర్ణాలకు పది శాతం రిజర్వేషన్లు కల్పించనుంది. ఈ నిర్ణయం వెనుక నాలుగు తక్షణ రాజకీయ కారణాలు కనిపిస్తున్నాయి.
1 ఎస్సీ/ఎస్టీలపై వేధింపుల నిరోధక చట్టంలోని కొన్ని నిబంధనలను న్యాయస్థానం తిరస్కరించినా ప్రభుత్వం వాటిని పునరుద్ధరించింది. దీనిపై అగ్రవర్ణాల వారు ఆగ్రహంతో ఉండడంతో వారికి సర్దిచెప్పడానికి వీలు ఏర్పడుతుంది. 
2 కీలకమైన ఉత్తర్‌ప్రదేశ్‌లోని అగ్రవర్ణాలను బిజెపికి దూరం చేయడం కోసం కాంగ్రెస్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నది. గతంలో ఎస్పీ-బీఎస్పీ- కాంగ్రెస్‌లు కూటమిగా ఏర్పడి పోటీ చేసినప్పుడు అగ్రవర్ణాల వారు బిజెపికి మద్దతు ఇచ్చారు. ఇప్పుడు ఎస్పీ- అగ్రవర్ణాలని తిరిగి తమవైపు తిప్పుకొనేందుకు కాంగ్రెస్ చేస్తున్న ప్రయత్నాలకు ఇప్పుడు గండి పడే అవకాశం ఉంది.
3. దేశంలో పలు రాష్ట్రాలలో  సామాజికంగా బలమైన పలు వర్గాలు రేజర్వేషన్లు కావాలని పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్నాయి. పలు రాష్ట్రాలు వారి డిమాండ్ లకు తలొగ్గి అందుకు అనువుగా చట్టాలు కూడా తీసుకు వచ్చాయి. వాటి విషయంలో ఒక నిర్ణయం తీసుకోవలసిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై పడింది.
4. సాంప్రదాయకంగా బిజెపికి అండగా ఉంటున్న మధ్య తరగతి ప్రజలు ఈ మధ్య కాలంలో దీర్ఘకాల ప్రయోజనాలు ఉద్దేశించి మోదీ ప్రభుత్వం చేపట్టిన నోట్ల రద్దు వంటి నిర్ణయాలతో వ్యక్తిగతంగా నష్టాలకు గురవుతున్నారు. అటువంటి వర్గాలను ప్రసన్నం చేసుకోవడానికి ఇప్పుడు అవకాశం ఏర్పడుతుంది. 
  బీసీలకు రిజర్వేషన్లు కల్పించడానికి ఉద్దేశించిన మండల్‌ కమిషన్‌ నివేదిక అమలుపై అగ్రవర్ణాలు ఆగ్రహం చెందడంతో గతంలో పీవీ నరసింహారావు ప్రభుత్వం వారికి కూడా 10 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని నిర్ణయించింది. అయితే మొత్తం రిజర్వేషన్లు 50 శాతానికి మించకూడదంటూ సుప్రీంకోర్టు దాన్ని తిరస్కరించింది. ప్రస్తుతం వీటన్నింటిని పరిగణనలోకి తీసుకొనే నిర్ణయం తీసుకున్నట్టు ఓ మంత్రి చెప్పారు.
  చట్టపరంగా ఇబ్బందులు ఉండకూడదనే ఆర్థికంగా వెనుకబడిన వర్గం (ఈడబ్ల్యూఎస్‌) అనే కొత్త వర్గాన్ని సృష్టించాం. ఇందుకోసం రాజ్యాంగంలోని 15, 16వ అధికరణాలను సవరించనున్నాం. ఎస్సీ/ఎస్టీ/ఓబీసీ రిజర్వేషన్ల మాదిరిగా ఇక్కడ కులం ప్రాతిపదిక కాదు. గందరగోళం లేకుండా ఉండడం కోసం ఈడబ్ల్యూఎస్‌ అంటే కచ్చితమై నిర్వచనాన్ని ఇవ్వనున్నట్టు తెలిపారు.
  మహారాష్ట్ర ప్రభుత్వం ఇటీవల మరాఠీలకు 16 శాతం రిజర్వేషన్లు కల్పించింది. ఇది నిర్ణీత 50 శాతం పరిమితిని మించడంతో ముందుగానే న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. తమ వాదనలను పూర్తిగా వినకుండా ఉత్తర్వులను కొట్టివేయకూడదంటూ బాంబే హైకోర్టులో కేవియట్‌ పిటిషన్‌ను దాఖలు చేసింది. అందుకు కోర్టు అంగీకరించింది. ఆ కారణంగానే  నవంబరు 29న ప్రకటించిన రిజర్వేషన్లపై ఇంతవరకు అభ్యంతరం తెలపలేదు.
ముఖ్యంగా ఈ నిర్ణయంతో గ్రామీణ వర్గాలు ఎక్కువగా ప్రయోజనం పొందే అవకాశం ఉంది. వ్యవసాయ రంగంలో నెలకొన్న సంక్షోభం కారణంగా రైతులు, గ్రామీణ ప్రజలు పలు చోట్లా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై కొంతమేరకు అసంతృప్తిలో ఉన్నారు. అటువంటి వర్గాలకు కొంత ఉపశమనం కలిగించే అవకాశం ఉంటుంది.
ఈ నిర్ణయంతో పాటు మరొకొన్ని కీలక నిర్ణయాలను తీసుకోవడానికి మోదీ ప్రభుత్వం సమాయత్తం అవుతున్నట్లు తెలుస్తున్నది. ముఖ్యంగా  జీఎస్టీ కారణంగా సంప్రదాయంగా మద్దతు ఇచ్చే వ్యాపార వర్గాలలో కొంతమేరకు అసంతృప్తి ఏర్పడుతున్నది. ప్రస్తుతం వార్షిక టర్నోవర్‌ రూ.20 లక్షలు ఉన్నవారికి పన్ను వర్తిస్తోంది. దాంతో రూ.40-50 లక్షల వార్షిక టర్నోవర్‌ ఉన్నవారిని కూడా పన్ను నుంచి మినహాయించాలని ప్రభుత్వం భావిస్తోన్నట్లు తెలుస్తున్నది.