తెలంగాణలో అడవుల పెంపకానికి దోహదపడే విధంగా కేంద్రం నుండి కంపెన్సేటరీ ఎఫోరెస్టేషన్ ఫండ్ మేనేజ్‌మెంట్ అండ్ ప్లానింగ్ అథారిటీ (కాంపా) ద్వా...
తెలంగాణలో అడవుల పెంపకానికి దోహదపడే విధంగా కేంద్రం నుండి కంపెన్సేటరీ ఎఫోరెస్టేషన్ ఫండ్ మేనేజ్‌మెంట్ అండ్ ప్లానింగ్ అథారిటీ (కాంపా) ద్వారా రూ 2250 కోట్ల మేరకు నిధుల విడుదలకు రంగం సిద్దమైనది. ఈ మేరకు సాధికారిక కమిటీ రూపొందించిన మార్గదర్శకాలను రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర అటవీ పర్యావరణ మంత్రిత్వశాఖ పంపింది.
ఇప్పటి వరకు కేవలం పది శాతం మేర మాత్రమే కాంపా నిధులను విడుదల చేయాలన్న నిబంధన ఉండడంతో స్వల్ప నిధులతో అటవీ అభివృద్ధి పనులు చేపట్టలేకపోతున్నామని ముఖ్యమంత్రి కె చంద్రశేఖరావు వివరించడంతో ఇప్పుడు 90% మేర విడుదల చేయాలని కేంద్రం నిర్ణయించింది. ఈ ప్రకారం కేంద్రం దగ్గర అన్ని రాష్ట్రాలకు చెందిన పోగుపడిన సుమారు రూ. 50 వేల కోట్ల మేర కాంపా నిధుల్లో తెలంగాణకు చెందినవి రూ. 2500 కోట్లు ఉన్నాయి. ఇందులో 90% లెక్కన రూ. 2250 కోట్లు అందనున్నాయి.
ఈ నిధులతో రాష్ట్రవ్యాప్తంగా అర్బన్ పార్కుల అభివృద్ధి, హరితహారం, అడవుల పెంపకం, అటవీ పరిరక్షణ, ప్రాజెక్టుల నిమిత్తం సేకరించిన అటవీ భూమికి బదులుగా అడవుల పెంపకం తదితర పనులకు ఈ నిధుల్ని రాష్ట్ర ప్రభుత్వం వెచ్చించనుంది. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఒక బ్యాంకు ఖాతాను తెరుస్తుందని, కేంద్రం నుంచి రూ. 2250 కోట్లు ఇందులో జమ అవుతాయని, అటవీ అవసరాల నిమిత్తం ఈ నిధుల్ని వినియోగించుకోవాల్సినప్పుడు కేంద్ర అటవీ పర్యావరణ మంత్రిత్వశాఖకు ఆ వివరాలను తెలియజేసి అనుమతి పొందిన తర్వాత ఖర్చు చేసుకోవచ్చునని రాష్ట్ర అటవీశాఖ అధికారి ఒకరు తెలిపారు.
మిగిలిన పదిశాతం (రూ. 250 కోట్లు) కేంద్రం దగ్గరే ఉంటాయని, నిర్వహణా అవసరాల నిమిత్తం వాటిని రిజర్వుగా ఉంచుకుంటుందని వివరించారు. అయితే రాష్ట్రాలకు కేటాయించిన 90% నిధుల్లో ఏ స్వల్ప మొత్తంలో వినియోగించుకోవాలనుకున్నా ఆయా రాష్ట్రాలు వార్షిక అటవీ ప్రణాళికలతో పాటు నిర్దిష్టంగా ఆయా కార్యక్రమాలకు సంబంధించిన నివేదికను కేంద్రానికి పంపి అనుమతి పొందాల్సి ఉంటుంది. ఆయా కార్యక్రమాలకు అవుతున్న అంచనా వ్యయం, ప్రణాళిక, అమలు చేయనున్న ఏజెన్సీ, నిర్దిష్ట గడువు తదితర వివరాలన్నింటితో కూడిన ‘వర్కింగ్ ప్లాన్’ను సమర్పించాల్సి ఉంటుంది.
వాస్తవానికి సవరించిన ‘కాంపా’ నిధుల మార్గదర్శకాలను కేంద్ర ప్రభుత్వం గతేడాది సెప్టెంబరులోనే పంపినప్పటికీ అసెంబ్లీ రద్దు, ఆ తర్వాత ఎన్నికల నిర్వహణ, ఎన్నికల కోడ్ తదితర అంశాల కారణంగా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే దృష్టి పెట్టలేకపోయింది. ఇప్పుడు నిధుల కొరతకు ఇబ్బంది లేనందువల్ల ముఖ్యమంత్రి కెసిఆర్ ఆలోచనలకు అనుగుణంగా పచ్చదనాన్ని పెంపొందించడం, అటవీ విస్తీర్ణాన్ని పెంచతం తదితర అవసరాలకు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసుకునే వెసులుబాటు కలిగింది.
అతి త్వరలో అటవీ శాఖ ఇందుకు సంబంధించిన ముసాయిదా నివేదికను ముఖ్యమంత్రికి పంపుతుందని, ఆ తర్వాత చర్చల అనంతరం స్పష్టత వస్తుందని ఆ అధికారి పేర్కొన్నారు.