Page Nav

HIDE

Grid

GRID_STYLE

Pages

latest

రాఫెల్‌ ఒప్పందం లో అవినీతి జరగలేదు - సుప్రీంకోర్టు

దేశ రాజకీయాల్లో వివాదాలకు కేంద్రబిందువుగా మారిన రఫేల్‌ ఒప్పందంపై సుప్రీంకోర్టులో కేంద్రానికి ఊరట లభించింది. ఫ్రాన్స్‌ నుంచి 36 రఫేల్‌ యుద్ధ...

దేశ రాజకీయాల్లో వివాదాలకు కేంద్రబిందువుగా మారిన రఫేల్‌ ఒప్పందంపై సుప్రీంకోర్టులో కేంద్రానికి ఊరట లభించింది. ఫ్రాన్స్‌ నుంచి 36 రఫేల్‌ యుద్ధ విమానాలు కొనుగోలు చేసేందుకు ఒప్పందం కుదుర్చుకున్న మోదీ ప్రభుత్వానికి సర్వోన్నత న్యాయస్థానం క్లీన్‌చిట్ ఇచ్చింది. ఈ మేరకు రఫేల్‌ ఒప్పందంలో అవకతవకలు జరిగాయని, వీటిపై కోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు జరపాలంటూ దాఖలైన అన్ని పిటిషన్లను న్యాయస్థానం తోసిపుచ్చింది.

రఫేల్‌ ఒప్పంద ప్రక్రియలో అనుమానించదగ్గదేమీ లేదని చీఫ్‌ జస్టిస్‌ రంజన్‌ గొగొయ్‌ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం తెలిపింది. ఏ దేశానికైనా యుద్ధ విమానాలు అవసరం అని, భారత వైమానిక దళంలోకి నాలుగు, ఐదో తరం యుద్ధవిమానాలను చేర్చాల్సిన అవసరం ఎంతైనా ఉందని కోర్టు అభిప్రాయపడింది. దేశ భద్రత దృష్ట్యా కొన్ని అంశాల్లో గోప్యత పాటించాల్సి వస్తుందని కోర్టు పేర్కొంది. రఫేల్‌ ఒప్పంద నిర్ణయ విధానం, ధరల వ్యవహారం, అంతర్జాతీయ ఒప్పందం వంటి అంశాల్లో న్యాయస్థానం జోక్యం చేసుకునేందుకు ఎలాంటి కారణాలు కన్పించట్లేదని కోర్టు తెలిపింది. ఈ ఒప్పందం 2016 సెప్టెంబర్‌లో జరిగినప్పుడు ఎలాంటి అనుమానాలు రేకెత్తలేదని కేవలం ఫ్రాన్స్‌ మాజీ అధ్యక్షుడు హోలన్‌ వ్యాఖ్యలు చేసిన తర్వాతే దీనిపై వివాదం మొదలైందని కోర్టు పేర్కొంది. ఆయన చేసిన వ్యాఖ్యలను న్యాయవిచారణకు స్వీకరించలేదని కోర్టు తెలిపింది. అంతేగాక .. ఈ ఒప్పందంలో ప్రయివేటు సంస్థకు వాణిజ్య లబ్ధి చేకూరుతుందని చెప్పేలా సాక్ష్యాలేమీ లేవని న్యాయస్థానం పేర్కొంది.

రఫేల్‌ ఒప్పందంతో కేంద్ర ప్రభుత్వం భారీ కుంభకోణానికి పాల్పడిందంటూ గత కొంతకాలంగా కాంగ్రెస్‌ ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రఫేల్‌ యుద్ధవిమానాల ఒప్పందంపై కోర్టు పర్యవేక్షణలో దర్యాప్తునకు ఆదేశించాలంటూ యశ్వంత్‌ సిన్హా, అరుణ్ శౌరీ, న్యాయవాది ఎంఎల్‌ శర్మ తదితరులు సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై విచారణ జరిపిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గొగొయి నేతృత్వంలోని ధర్మాసనం నవంబర్‌ 14న తీర్పును రిజర్వ్‌లో పెట్టింది. తాజాగా ఈ పిటిషన్లను కొట్టివేస్తూ ధర్మాసనం తీర్పు వెలువరించింది.