హైదరాబాద్ మెట్రో (Hyderabad Metro) రైలులో గుండెను తరలించిన వార్త అందరికీ తెలిసిందే. ఐతే ఆ గుండెను దానం చేసిన రైతు కుటుంబానికి భువనగిరి ఎంపీ ...
నర్సిరెడ్డి మరణం ఆ కుటుంబానికి తీరని లోటని.. తనవంతుగా రూ. లక్ష ఆర్ధిక సాయం చేస్తామని కోమటిరెడ్డి వెంటకరెడ్డి చెప్పారు. అలాగే ఇద్దరు పిల్లల చదువుకు అయ్యే ఖర్చును ప్రతీక్ ఫౌండేషన్ ద్వారా అందజేస్తామని తెలిపారు. వారు జీవితంలో స్థిరపడే వరకు అండగా ఉంటామని స్పష్టం చేశారు భువనగిరి ఎంపీ. ఇలాంటి అనుకోని ఘటనలు జరిగినప్పుడు గుండె నిర్భరం చేసుకుని ఇతరుల జీవితాలను కాపాడేందుకు నర్సిరెడ్డిని స్ఫూర్తిగా తీసుకోవాలని సూచించారు.
నల్గొండ జిల్లా మోత్కూరుకు చెందిన 45 ఏళ్ల రైతు నర్సిరెడ్డి ఈనెల 30న బ్రెయిన్ డెడ్ అయి మరణించాడు. అయితే అతడి గుండెను దానం చేసేందుకు కుటుంబసభ్యులు ముందుకువచ్చారు. దీంతో జూబ్లీహిల్స్ అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మరో వ్యక్తికి గుండె మార్పిడి చేసేందుకు వైద్యులు సిద్ధమయ్యారు. అయితే నగరంలో విపరీతంగా పెరిగిపోయిన ట్రాఫిక్ నేపథ్యంలో గుండె తరలింపునకు వైద్యులు హైదరాబాద్‌ను మెట్రోను ఎంచుకున్నారు. ఈ మేరకు మెట్రో అధికారులతో సంప్రదింపులు జరిపారు.
మంగళవారం మెట్రో రైలు అధికారులు సహకారంతో ఎల్బీనగర్ కామినేని ఆస్పత్రి నుంచి జూబ్లీహిల్స్ అపోలో ఆస్పత్రికి గుండెను తరలించారు. ఇందుకోసం నాగోలు మెట్రో స్టేషన్ నుంచి జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు వరకు తొలిసారిగా గ్రీన్ ఛానెల్‌ను ఏర్పాటు చేశారు. జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ నుంచి అపోలో ఆసుపత్రి వరకు కూడా రోడ్డుపై గ్రీన్ ఛానల్ ద్వారా గుండెను తరలించారు. ఈ గుండెను అపోలో ఆస్పత్రిలో పొందుతున్న వ్యక్తికి అమర్చారు. డాక్టర్ గోకులే నేతృత్వంలో గుండెమార్పిడి శస్త్రచికిత్స విజయవంతంగా నిర్వహించారు.