హైదరాబాద్ : పట్టభద్రుల కోటా ఎమ్మెల్సీ అభ్యర్థి ఎంపికపై టీఆర్‌ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. హైద...
హైదరాబాద్ : పట్టభద్రుల కోటా ఎమ్మెల్సీ అభ్యర్థి ఎంపికపై టీఆర్‌ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్ నగర్ స్థానానికి మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహారావు కుమార్తె వాణిదేవిని అభ్యర్థిగా ఖరారు చేశారు. టీఆర్‌ఎస్ వర్గాల సమాచారం ప్రకారం సోమవారం ఆమె నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఈ స్థానం అభ్యర్థి ఎంపికపై గతకొంత కాలంగా ఉత్కంఠ కొనసాగుతున్న విషయం తెలిసిందే. జీహెచ్‌ఎంసీ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్‌కు అవకాశం ఇస్తారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగినప్పటికీ ఎవరూ ఊహించని విధంగా ఆదివారం కేసీఆర్ అభ్యర్థిని ప్రకటించారు. ఖమ్మం-వరంగల్-నల్గొండ స్థానానికి ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వరరెడ్డిని ఖరారు చేసిన విషయం తెలిసిందే.
కరోనా కారణంగా ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం కావడం, నిరుద్యోగులు ఉపాధి అవకాశాలు సంక్లిష్టం కావడం వంటి గడ్డు పరిస్థితుల్లో ఎన్నిక జరుగుతుండటం అధికార టీఆర్‌ఎస్ పార్టీకి కొంత ఇబ్బందికర పరిణామమే. ఉన్న ఉద్యోగాలు ఊడిపోవడంతో పాటు గత ఏడాదిన్నరగా కొత్త ఉద్యోగాలకు నోటిఫికేషన్లు లేవనేది నిరుద్యోగుల వాదన. దానికి తోడు కరోనా కాలంలో తనను ఆదుకోలేదని, గత ఎన్నికల సమయంలో ఇచ్చిన నిరుద్యోగ భృతి అమలు చేయడంలేదని ప్రభుత్వంపై గుర్రుగా ఉన్నారు. ఈ నేపథ్యంలో రెండు పట్టభద్రుల స్థానాలను గెలుపొందడం గులాబీ పార్టీకి అంతసులువైన విషయం కాదు. బరిలో ప్రధాన పార్టీలతో పాటు ఉద్యమనేతలు కూడా ఉండటం టీఆర్‌ఎస్ కొంతమేర ఇబ్బంది ఉండొచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. మొత్తానికి తెలంగాణ మరో రసవత్తరమైన పోటీకి సిద్ధమైంది.
పట్టభద్రుల శాసనమండలి స్థానాలకు ఎన్నికల నిర్వహణకుగాను కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్‌ను ప్రకటించిన విషయం తెలిసిందే. ఫిబ్రవరి 23 వరకు నామినేషన్ల దాఖలుకు గడువు ఉండగా.. మార్చి 14న పోలింగ్ జరుగనుంది. మార్చి 17వ తేదీన ఓట్ల లెక్కింపు ఉంటుంది. రామచంద్రరావు, పల్లా రాజేశ్వర్‌రెడ్డి పదవీ కాలం ముగియడంతో ఈ ఎన్నిక జరుగుతోంది.