పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలపై కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ నిస్సహాయత వ్యక్తం చేశారు. ఈ పెట్రోల్ భారం తనకు కూడా ధర్మసంక...
పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలపై కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ నిస్సహాయత వ్యక్తం చేశారు. ఈ పెట్రోల్ భారం తనకు కూడా ధర్మసంకటంగానే ఉందని, అయినప్పటికీ తాను ఒక్కదాన్నే ఏం చేయలేనని వ్యాఖ్యానించారు. శనివారం చెన్నై సిటిజన్స్ ఫోరం ఆధ్వర్యంలో జరిగిన ప్రత్యేక చర్చా కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడారు. పెట్రోల్ భారంపై తానిచ్చే సమాధానంతో ఏ ఒక్కరినీ సంతృప్తిపర్చలేనని అన్నారు. ధరల తగ్గింపు అనే సమాధానం మినహా ఏ ఒక్క దానిని ప్రజలు అంగీకరించరని అన్నారు.
పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడం ఆందోళన కలిగించే విషయమేనని ఆమె అన్నారు. పెట్రోల్, డీజిల్‌ను జీఎస్టీ పరిధిలోకి చేర్చడంపై జీఎస్టీ కౌన్సిల్ తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉందన్నారు. ప్రభుత్వరంగ చమురు సంస్థలే ఈ నిర్ణయం తీసుకుంటున్నాయని ఆమె గుర్తు చేశారు. ఇదే సమయంలో మన దేశం ఇలా ఉందేంటని బాధపడేకంటే.. దేశానికి మన వంతుగా ఏం చేశామన్నదానిపై ప్రజలు ఆత్మ పరిశీలన చేసుకోవాలని ఆమె పిలుపునిచ్చారు. భారత ఆర్థిక వ్యవస్థ ఖచ్చితంగా ఐదు ట్రిలియన్ డాలర్లకు చేరుకుందని ఆర్థిక మంత్రి పేర్కొన్నారు.