విశ్వనటుడు కమల్ హాసన్ రాజకీయాల్లోకి ప్రవేశించారు. మక్కల్ నీది మయ్యం అనే పార్టీని స్థాపించారు. త్వరలో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఈ పార్ట...
విశ్వనటుడు కమల్ హాసన్ రాజకీయాల్లోకి ప్రవేశించారు. మక్కల్ నీది మయ్యం అనే పార్టీని స్థాపించారు. త్వరలో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఈ పార్టీ తరపున అభ్యర్థులను బరిలోకి దించనున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవలే ఆ పార్టీ సర్వసభ్య సమావేశాన్ని ఏర్పాటు చేసిన కమల్ హాసన్ ఎన్నికలతో పాటు.. తాజా రాజాకీయాలపై చర్చించారు.
మరోవైపు, అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది. దీంతో ఎన్నికల్లో అభ్యర్థుల ఎన్నికల ప్రక్రియతో పాటు పార్టీల బలాన్ని మరింత పెంచుకోవడానికి కీలక నేతలంతా ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. కమల్ హాసన్ కూడా ఇదే పనిలో నిమగ్నమయ్యారు. తమిళనాడు, పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికలకు అభ్యర్థులను ఎంపిక చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో ఆయన ఓ షరతు పెట్టారు. తమ పార్టీ నుంచి పోటీ చేయాలనుకుంటోన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవాలని, వారు దరఖాస్తు రుసుముగా రూ.25 వేలు చెల్లించాలని పేర్కొన్నారు. పార్టీయేతర నేతలు కూడా దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు.
తమిళనాడులోని 234 నియోజక వర్గాల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఒక్క తమిళనాడులోనే కాకుండా రాష్ట్ర హోదా కలిగిన పుదుచ్చేరిలో కూడా తమ పార్టీ పోటీ చేస్తుందని, అక్కడ కూడా పోటీ చేసే అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చని కోరారు.