ఆస్ట్రేలియా దేశ పార్లమెంట్ వేదికగా ఓ మహిళపై అఘాయిత్యం జరిగింది. సమావేశానికి రమ్మని పిలిచిన సహ ఉద్యోగే ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆలస...
ఆస్ట్రేలియా దేశ పార్లమెంట్ వేదికగా ఓ మహిళపై అఘాయిత్యం జరిగింది. సమావేశానికి రమ్మని పిలిచిన సహ ఉద్యోగే ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనపై ఆ దేశ ప్రధాని స్కాట్ మారిసన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత మహిళకు క్షమాపణలు చెప్పిన ప్రధాని ఆమెకు న్యాయం చేస్తానని హమీ ఇచ్చారు.
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, దాదాపు రెండేళ్ల క్రితం 2019 మార్చిలో పార్లమెంట్‌లోని రక్షణమంత్రి లిండా రెనాల్డ్ ఆఫీస్‌లో తనపై అత్యాచారం జరిగిందని ఓ మహిళ ఇటీవల వెల్లడించింది.
ఈ విషయంపై స్థానిక మీడియాతో మాట్లాడిన ఆమె.. ఘటన గురించి ఆ ఏడాది ఏప్రిల్ నెలలోనే తాను పోలీసులకు చెప్పానని, అయితే తన కెరీర్‌ను దెబ్బతీస్తారని భయపడి అధికారికంగా ఫిర్యాదు చేయలేదని చెప్పారు. రెనాల్డ్ కార్యాలయంలో పనిచేసే సీనియర్ సిబ్బంది ఒకరు సమావేశం ఉందని పిలిచి తనపై అఘాయిత్యానికి పాల్పడినట్లు ఆరోపించారు.
మహిళ వ్యాఖ్యలపై రక్షణమంత్రి రెనాల్డ్ స్పందిస్తూ.. అత్యాచారంపై పోలీసులకు చెప్పిన మాట వాస్తవమేనని తెలిపారు. అయితే కేసు పెట్టకుండా తనను ఎవరూ ఒత్తిడి చేయలేదని మహిళే స్వయంగా చెప్పారని అన్నారు.
ఈ ఘటన గురించి తెలియగానే ప్రధాని స్కాట్ మారిసన్.. బాధిత మహిళకు క్షమాపణలు తెలియజేశారు. ఇలాంటి ఘటన జరిగి ఉండాల్సింది కాదు. పని ప్రదేశాల్లో మహిళలకు భద్రత కల్పించాల్సిన బాధ్యత మాపై ఉంది. ఘటనపై తప్పకుండా విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటాం అని మారిసన్ హామీ ఇచ్చారు.