హైదరాబాద్: ఇప్పటికే పెరుగుతున్న పెట్రోల్, గ్యాస్ సిలిండర్ ధరలతో నానా ఇబ్బందులు పడుతున్న సామాన్యుడిపై మరో భారం పడనుంది. ప్రస్తుతం పెట్రోల...
హైదరాబాద్: ఇప్పటికే పెరుగుతున్న పెట్రోల్, గ్యాస్ సిలిండర్ ధరలతో నానా ఇబ్బందులు పడుతున్న సామాన్యుడిపై మరో భారం పడనుంది. ప్రస్తుతం పెట్రోల్, డీజిల్ ధరలు పెరగటం వల్ల నిత్యావసర ధరలు ఆకాశాన్ని తాకు తున్నాయి. కరోనా లాక్ డౌన్ తర్వాత సుమారు రూ.200 వరకు గ్యాస్ ధర పెరిగినట్టు అంచనా. ఇప్పటికే వీటి విషయంపై మండిపోతున్న ప్రజలు వారి ఆగ్రహాన్ని సోషల్ మీడియా ద్వారా వ్యక్తం చేస్తున్నారు. అయితే, తాజాగా పాల ధరలు పెరగనున్నాయి అని సమాచారం.
ప్రస్తుతం పాల ధర బహిరంగ మార్కెట్ లో లీటరు రూ.60గా ఉంది. పదకొండు రోజుల నుంచి డీజిల్ రేట్లు ఏకధాటిగా పెరగడంతో రవాణా ఛార్జీలు కూడా పెరుగడంతో ఆ భారం వినియోగదారులపై వేయక తప్పని పరిస్థితి అని పాల ఉత్పత్తి దారులు తెలియజేస్తున్నారు. డీజిల్ ధరల పెరుగుదల కారణంగా పశువుల దాణా కోసం, సేకరించిన పాలను విక్రయించడాయినికి అయ్యే ఖర్చులు తడిసి మోపెడు అవుతున్నట్లు పాల ఉత్పత్తి దారులు పేర్కొన్నారు.
ఇప్పుడు ఆ పెరిగిన ధరలను ప్రజలపై వేయక తప్పదని ఆంధ్రప్రదేశ్‌లో ప్రముఖ డెయిరీ సంస్థ ప్రతినిధి ఒకరు తెలిపారు. పెరిగే పాల ధర కనీసం లీటర్ మీద రూ.2 వరకు పెరగొచ్చని ప్రతినిధి చెప్పారు. భవిష్యత్ లో ఇదే విధంగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగితే పాల ధర మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు పేర్కొన్నారు.