సిరిసిల్ల రూరల్: జిల్లాలో ప్రేమజంట ఆత్మహత్యకు పాల్పడిన ఘటనలో ప్రియుడు మృతిచెందాడు. ఇప్పటికే ప్రియురాలు కూడా మరణించడంతో ఇరు కుటుంబాల్లో విష...
సిరిసిల్ల రూరల్: జిల్లాలో ప్రేమజంట ఆత్మహత్యకు పాల్పడిన ఘటనలో ప్రియుడు మృతిచెందాడు. ఇప్పటికే ప్రియురాలు కూడా మరణించడంతో ఇరు కుటుంబాల్లో విషాదం నెలకొన్నది. తంగళ్లపల్లి మండల కేంద్రానికి చెందిన ఒగ్గు మధుమిత (15), ఓబులాపూర్ గ్రామానికి చెందిన బండి రాజు (18) గత కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. ఇరువురి ప్రేమను పెద్దలు అంగీకరించరనే కారణంతో జనవరి 31న తంగళ్లపల్లి గ్రామ శివారులో వ్యవసాయ పొలంలో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. దీంతో స్థానికులు ఇద్దరిని దవాఖానకు తరలించారు. అయితే మధుమిత పరిస్థితి అప్పటికే విషమించడంతో ఆమెను ఎల్లారెడ్డిపేటలోని ప్రైవేట్ దవాఖానకు తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ ఈ నెల 2న మధుమిత మృతి చెందింది. రాజును హైదరాబాద్‌లోని నిమ్స్‌కు తరలించి చికిత్స చేయించారు. అటునుంచి సిరిసిల్లలోని ఓ ప్రైవేటు దవాఖానలో చేర్పించారు. ఈక్రమంలో పరిస్థితి విషమించడంతో శుక్రవారం ఉదయం రాజు కూడా మృతి చెందాడు. కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.