ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడుకు మరో షాక్ తగిలింది. ఇటీవల ముగిసిన పంచాయతీ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలై కష్టాల్లో ఉన్న అధినేతకు తెలుగు తమ్ముళ...
ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడుకు మరో షాక్ తగిలింది. ఇటీవల ముగిసిన పంచాయతీ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలై కష్టాల్లో ఉన్న అధినేతకు తెలుగు తమ్ముళ్లు వరుస షాకులు ఇస్తున్నారు. తాజాగా చంద్రబాబు నాయుడు పీఏ మనోహర్ ఆ బాధ్యతల నుంచి తప్పుకున్నారు. ఎన్నికల ఫలితాలు వెలువడినప్పటి నుంచి చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో ఆయన వైదొలిగారు. కాగా 35 ఏళ్లుగా టీడీపీకి కంచుకోటగా ఉన్న చంద్రబాబు సొంత అసెంబ్లీ నియోజకవర్గం కుప్పంలో ఆ పార్టీ దారుణ ఓటమి చవిచూడటం కార్యకర్తలు, స్థానిక నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఓటమికి పార్టీ నేత వ్యవహార తీరే కారణమంటూ తిరుగుబాటు చేస్తున్నారు. ఈ క్రమంలోనే మంగళవారం కుప్పం నియోజకవర్గంలో పర్యటించిన ఆ పార్టీ ఇన్‌చార్జ్ మునిరత్నం, చంద్రబాబు పీఏ మనోహర్‌లకు స్థానిక కార్యకర్తలు ఎదురుతిరిగారు. ఈ ఇద్దరి తీరు వల్లే ఎన్నికల్లో ఓటమి చెందామని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో కార్యకర్తల ఆగ్రహానికి తలొగ్గిన మనోహర్ పీఏ బాధ్యతల నుంచి తప్పుకున్నారు.
మరోవైపు గురువారం నుంచి కుప్పంలో ఆ పార్టీ అధినేత పర్యటించనున్న నేపథ్యంలో బుధవారం మండలాల వారీగా టీడీపీ సమావేశాలు నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ శ్రీనివాసులు, మనోహర్, నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ ముణిరత్నం హాజరుకాకపోవడం చర్చనీయాంశంగా మారింది. టీడీపీలో తాజా పరిణామాలపై కుప్పంలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. కాగా టీడీపీ ఆవిర్భావం నుంచి కంచుకోటగా ఉన్న చంద్రబాబు నాయుడు నియోజకవర్గంలో వైఎస్సార్ సీపీ జెండా రెపరెపలాడిన విషయం తెలిసిందే. కుప్పం నియోజకవర్గంలో 89 పంచాయతీల్లో ఎన్నికలు జరగ్గా, 74 పంచాయతీల్లో వైఎస్సార్ సీపీ మద్దతుదారులు విజయం సాధించారు. పది పంచాయతీల్లో టీడీపీ డిపాజిట్లు గల్లంతయ్యాయి. బాబు గుండె కాయ అన్ని చెప్పుకునే గుడుపల్లె మండలంలో 13 పంచాయతీలు వైఎస్సార్ సీపీ కైవసం చేసుకుంది.