పత్రికా ప్రమాణాలు, టీవీ ఛానల్‌ల నైతిక విలువలను గాలికొదిలేసి.. తెలుగుదేశం పార్టీ కరపత్రికలా, ప్రసార సాధనంలా పని చేస్తున్న ఏబీఎన్ ఆంధ్రజ్యోత...
పత్రికా ప్రమాణాలు, టీవీ ఛానల్‌ల నైతిక విలువలను గాలికొదిలేసి.. తెలుగుదేశం పార్టీ కరపత్రికలా, ప్రసార సాధనంలా పని చేస్తున్న ఏబీఎన్ ఆంధ్రజ్యోతిని భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాఖ బహిష్కరించింది. నిన్న ఏబీఎన్ ఛానల్‌లో జరిగిన చర్చా కార్యక్రమంలో ఏపీ బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్‌రెడ్డిపై జరిగిన దాడి నేపథ్యంలో ఈమేరకు నిర్ణయం తీసుకున్నట్లు ఏపీ బీజేపీ మీడియా ఇంచార్జి వుల్లూరి గంగాధర్ వెల్లడించారు. టీడీపీ ప్రయోజనాల కోసం దాడికి పాల్పడిన వ్యక్తిపై కేసు నమోదు చేయించకుండా, తిరిగి అతన్ని ఈ రోజు చర్చకు ఆహ్వానించడం సిగ్గుచేటని ఆయన ధ్వజమెత్తారు.
మీడియా ముసుగులో తెలుగుదేశం పార్టీ ప్రయోజనాలు కాపాడటమే లక్ష్యంగా పనిచేస్తున్న ఏబీఎన్ ఆంధ్రజ్యోతి టీవీ ఛానల్, ఆంధ్రజ్యోతి పత్రికలపై నేటి నుంచి బహిష్కరణ విధిస్తున్నట్లు తెలిపారు. ఇక నుంచి జరిగే పార్టీ పత్రికా విలేకరుల సమావేశాలకు ఆంధ్రజ్యోతిని ఆహ్వానించరాదని, ఆ టీవీ ఛానల్‌లో జరిగే చర్చా కార్యక్రమాల్లో బీజేపీ ప్రతినిధులు పాల్గొనరాదని పార్టీ నిర్ణయించినట్లు పేర్కొన్నారు. రాష్ట్ర బీజేపీ యొక్క ఈ అధికారిక నిర్ణయాన్ని ఉల్లంఘిస్తూ ఏబీఎన్ ఛానల్ తమకు నచ్చిన వారిని డిబేట్‌ల పేరుతో ఆహ్వానించి, వారి వాయిస్‌ను పార్టీ వాయిస్‌గా ప్రచారం చేసి ప్రజల్ని మోసం చేయాలని చూస్తే ఏబీఎన్ యాజమాన్యంపై చట్టపరమైన చర్యలకు ఉపక్రమిస్తామని ప్రకటించారు. ఆంధ్రజ్యోతి యాజమాన్యం బేషరతుగా క్షమాపణ చెప్పేవరకు ఈ బహిష్కరణ కొనసాగుతుందని ఆయన తెలిపారు.