రాంచీ: కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మధ్య వివాదాలు తరుచూ జరుగుతూనే ఉన్నాయి. పార్టీలోని అసంతృప్తిపరులను బుజ్జగించడంలో అగ్ర నాయకత్వ లోపమో లేద...
రాంచీ: కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మధ్య వివాదాలు తరుచూ జరుగుతూనే ఉన్నాయి. పార్టీలోని అసంతృప్తిపరులను బుజ్జగించడంలో అగ్ర నాయకత్వ లోపమో లేదంటే కార్యకర్తలపై పూర్తిగా పట్టింపు లేకపోవడం వల్లనో లేదంటే మరే ఇతర కారణాలు ఉన్నాయో కానీ, ఇలాంటి సంఘటనలు తరుచూ జరుగుతూనే ఉన్నాయి. తాజాగా జార్ఖండ్ రాష్ట్ర రాజధాని రాంచీలో ఉన్న పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన కొంత మంది కార్యకర్తలు సోమవారం గొడవపడ్డారు. అక్కడే ఉన్న మరికొంత మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వారిని ఆపే ప్రయత్నం చేసినప్పటికీ వినకుండా.. ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకుంటూ ఒకరినొకరు తోసుకున్నారు.
అయితే ఈ విషయమై రాష్ట్ర కాంగ్రెస్ సీనియర్ నేత అలోక్ దూబే స్పందిస్తూ.. ఇలాంటి ఘటనలు అన్ని పార్టీల్లోనూ జరుగుతూ ఉంటాయని, ప్రస్తుతం జరిగిన ఘటన పూర్తిగా తమ అంతర్గత విషయమని అన్నారు. కుటుంబంలో కూడా ఎన్నో కలహాలు వస్తుంటాయని, అంతమాత్రాన వాటిని పెద్దగా చేసి చూడడం, అక్కడ ఏదో జరిగిందని ప్రచారం చేయడం తగదని ఆయన పేర్కొన్నారు.