భివాండి : డైరీ వ్యాపారంలో అడుగుపెట్టిన రైతు, వ్యాపారవేత్త తన వ్యాపార ప్రయాణాలకు వీలుగా ఏకంగా హెలికాఫ్టర్‌నే కొనుగోలు చేశాడు. మహారాష్ట్రలోన...
భివాండి : డైరీ వ్యాపారంలో అడుగుపెట్టిన రైతు, వ్యాపారవేత్త తన వ్యాపార ప్రయాణాలకు వీలుగా ఏకంగా హెలికాఫ్టర్‌నే కొనుగోలు చేశాడు. మహారాష్ట్రలోని భివాండికి చెందిన బిల్డర్ జనార్థన్ భోర్ ఇటీవల పాల వ్యాపారంలో అడుగుపెట్టాడు. కొత్త వ్యాపారంలో ఆయన దేశంలోని వివిధ ప్రాంతాలను సందర్శించాల్సి ఉండగా దీనికోసం రూ 30 కోట్లు వెచ్చించి ఓ హెలికాఫ్టర్ కొనుగోలుకు ఆర్డర్ ఇచ్చాడు. తన డైరీ బిజినెస్ కోసం తాను పంజాబ్, హర్యానా, రాజస్తాన్, గుజరాత్‌లను తరచూ సందర్శించాల్సివస్తోందని పలు ప్రాంతాల్లో ఎయిర్‌పోర్ట్‌లు లేకపోవడంతో తాను ఎక్కువ సమయం ప్రయాణాల్లో గడపాల్సి వస్తోందన్నాడు. స్నేహితుడి సూచనతో ప్రయాణ కష్టాలను అధిగమించేందుకు హెలికాఫ్టర్‌ను కొనుగోలు చేశానని జనార్థన్ చెప్పుకొచ్చాడు.
హెలికాఫ్టర్‌ను ట్రయల్స్ కోసం తన గ్రామానికి తీసుకువెళ్లిన జనార్ధన్ పంచాయితీ సభ్యులను అందులో విహరించే ఏర్పాట్లు చేశాడు. 2.5 ఎకరాల స్థలంలో హెలికాఫ్టర్ కోసం ప్రొటెక్టివ్ వాల్‌ను నిర్మించాడు. ఇందులో హెలిపాడ్, పైలట్ రూమ్, టెక్నీషియన్ రూమ్‌ను నిర్మించాడు. మార్చి 15న హెలికాఫ్టర్ డెలివరీ అవుతుందని చెప్పాడు. వ్యవసాయం, డైరీ బిజినెస్‌లతో పాటు రియల్ ఎస్టేట్ వ్యాపారం కూడా చేసే జనార్థన్‌కు దాదాపు రూ 100 కోట్ల విలువైన ఆస్తులున్నాయి. భివాండి పరిసర ప్రాంతాల్లో బడా కంపెనీల గోడౌన్‌లు ఉండటంతో వాటి యజమానులకు భారీగా కిరాయి ముడుతోంది. దీంతో గ్రామీణ ప్రాంతంలోనూ ఇక్కడ మెర్సిడెజ్, ఫార్చూనర్, బీఎండబ్ల్యూ, రేంజ్ రోవర్ వంటి లగ్జరీ కార్ల డీలర్లు తమ దుకాణాలను తెరిచారు. ఈ ప్రాంతంలో జనార్థన్‌కు కూడా పలు గోడౌన్‌లు ఉండటంతో వాటిపై కిరాయిల ద్వారా భారీ రాబడి ఆర్జిస్తున్నాడు.