అమరావతి: రాష్ట్రానికి ఆదాయం వచ్చే అంశాలపై దృష్టి సారించాలని అధికారులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశించారు. నవరత్నాల్ల...
అమరావతి: రాష్ట్రానికి ఆదాయం వచ్చే అంశాలపై దృష్టి సారించాలని అధికారులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశించారు. నవరత్నాల్లోని ప్రతీ హమీని నెరవేర్చాల్సిన బాధ్యత మనపై ఉందని గుర్తుచేశారు. ప్రభుత్వ ఆదాయ వనరుల పెంపుపై గురువారం ఉన్నతాధికారులతో సీఎం జగన్ క్యాంపు కార్యాలయంలో సమీక్షించారు. ఇతర రాష్ట్రాల్లో టెండర్ల ద్వారా దక్కించుకున్న బొగ్గు గనుల కార్యకలాపాలపై మరింత దృష్టి సారించాలని ముఖ్యమంత్రి సూచించారు.
ఎర్రచందనం విక్రయం విషయంలో కేంద్రంతో సంప్రదించి త్వరితగతిన అనుమతులు తీసుకోవాలని సీఎం జగన్ అటవీ శాఖ అధికారులకు చెప్పారు. అవినీతికి ఆస్కారం లేకుండా పారదర్శకంగా ఎర్రచందనాన్ని విక్రయించాలని, ఈ విషయంలో ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయం చేసుకోవాలని తెలిపారు. మేనిఫెస్టోలో ఇచ్చిన మాట ప్రకారం నవరత్నాలు, సంక్షేమ పథకాల అమలుకు సంబంధించి ప్రజలకిచ్చిన ప్రతీ హమీని నెరవేర్చాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని గుర్తుచేశారు.
బొగ్గు గనుల నిర్వహణ
ఏపీఎండీసీ టెండర్ల ద్వారా దక్కించుకున్న జార్ఖండ్ బ్రహ్మదిహ కోల్‌మైన్, మధ్యప్రదేశ్‌లోని సులియారీ, చత్తీస్‌ఘడ్‌లోని మదన్‌పూర్ సౌత్ బొగ్గు గనుల నిర్వహణ, మైనింగ్ కార్యకలాపాలను నిర్ణీత గడువులోగా ప్రారంభించేందుకు చర్యలను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రానికి అధిక ఆదాయం వచ్చే మైనింగ్ కార్యకలాపాలపై మరింత దృష్టి సారించాలని సీఎం తెలిపారు. దీంతోపాటు సిలికా శాండ్‌కు సంబంధించి ఏపీఐఐసీతో సమన్వయం చేసుకుని వెంటనే కార్యకలాపాలను వేగవంతం చేయాలని చెప్పారు. రాష్ట్రానికి ఆదాయం వచ్చే అంశాలపై అధికారులు నిరంతరం సమీక్షలు నిర్వహించి ఎప్పటికప్పుడు అంచనాలు సిద్ధం చేసుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు. ప్రజలపై భారం వేయకుండా ఆదాయ వనరులను పెంచుకునేందుకు అవసరమైన ప్రణాళికలతో అధికారులు సిద్ధంగా ఉండాలని తెలిపారు.