అమెరికాకు చెందిన ప్రముఖ టైం మ్యాగజైన్ ఈ ఏడాది ప్రకటించిన అత్యంత ప్రభావవంతమైన వ్యక్తుల జాబితాలో పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఢిల్లీ...
అమెరికాకు చెందిన ప్రముఖ టైం మ్యాగజైన్ ఈ ఏడాది ప్రకటించిన అత్యంత ప్రభావవంతమైన వ్యక్తుల జాబితాలో పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఢిల్లీలోని షాహిన్‌బాగ్ ఆందోళన పాల్గొన బిల్కిస్ దాదీ(82) చోటు దక్కించుకోవడం గమనార్హం. ఆమెతో పాటు ఇండియా నుంచి ప్రధాని మోదీ సహా మరో ముగ్గురు భారతీయులకు ఆ జాబితాలో స్తానం దక్కింది.
బిల్కిస్ దాదీ 100 రోజుల పాటు పౌరసత్వ చట్ట సవరణకు వ్యతిరేకంగా జరిగిన ఆందోళనలో పాల్గొన్నారు. పొద్దున్నే 8కల్లా నిరసనకు కూర్చొనే ఆమె అర్ధరాత్రయినా కదిలేవారు కాదు. ఈ సందర్భంగా ఓ ఇంగ్లిష్ మీడియా సంస్థ చేసిన ఇంటర్వ్యూలో బిల్కిస్ దాదీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఒకవేళ మోదీ మిమ్మల్ని ఆహ్వానిస్తే ఆయనని కలవడానికి వెళతారా అని ఇంటర్వ్యూ చేసే మీడియా ప్రతినిధి అడిగినప్పుడు. ఆమె స్పందిస్తూ… ‘ఎందుకు వెళ్లను. తప్పకుండా వెళ్తాను. ఇందులో భయపడటానికి ఏం ఉంది. తను నా కొడుకు లాంటి వారు. నేను తనకు జన్మనివ్వకపోవచ్చు. మరో సోదరి ఆ పని చేసింది. అయినా తను నా బిడ్డలాంటి వాడే. ఈ జాబితాలో మోదీ పేరు కూడా ఉన్నందుకు నేను సంతోషిస్తున్నాను. ఆయనను అభినందిస్తున్నాను’ అని తెలిపారు. చూడండి ఇక్కడ అంతా కలిసే ఉన్నారు అంటూ మతసామరస్యాన్ని, భిన్నత్వంలో ఏకత్వ భావన గురించి అమూల్యమైన మాటలు చెప్పి అందరి మనసులు గెలుచుకున్నారు. ఇప్పుడు ప్రఖ్యాత టైమ్ మ్యాగజీన్‌లో చోటు సంపాదించుకుని ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందారు.