Page Nav

HIDE

Grid

GRID_STYLE

Pages

latest

హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ పై ప్రపంచ ఆరోగ్య సంస్థ వైకరి మార్చుకుందా? - vandebharath

హై డ్రాక్సీ క్లోరోక్విన్‌ (హెచ్‌సీక్యూ)పై ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) వైఖరి మార్చుకుంది. కరోనా వైరస్‌ చికిత్స కోసం క్లినికల...



హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ (హెచ్‌సీక్యూ)పై ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) వైఖరి మార్చుకుంది. కరోనా వైరస్‌ చికిత్స కోసం క్లినికల్‌ ట్రయల్స్‌ కొనసాగించాలని నిర్ణయం తీసుకుంది. అంతర్జాతీయ స్థాయిలో ట్రయల్స్‌ కొనసాగించడం సరైన దిశలో తీసుకున్న చర్యగా నిపుణులు భావిస్తున్నారు. ఈ ప్రయోగాల్లో వచ్చే ఫలితాలు ప్రపంచ వ్యాప్తంగా ప్రజలకు ఉపయోగపడతాయని అంటున్నారు.
హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ ఉపయోగించడం వల్ల గుండె, రక్తనాళాల వ్యవస్థ దెబ్బతినే అవకాశం ఉందని విదేశాల్లోని వైద్యులు ఆరోపించడంతో డబ్ల్యూహెచ్‌వో ఆ ట్రయల్స్‌ను నిలిపివేసింది. సేఫ్టీ డేటాను సమీక్షించిన తర్వాత ట్రయల్స్‌ కొనసాగించేందుకు నిర్ణయం తీసుకుంది. ‘అందుబాటులో ఉన్న మరణాల సమాచారాన్ని విశ్లేషించాక ఎలాంటి మార్పులు లేకుండానే ట్రయల్స్‌ కొనసాగించేందుకు భద్రతా పర్యవేక్షక కమిటీ ఏకగ్రీవంగా నిర్ణయించింది. గత ప్రణాళిక ప్రకారమే ట్రయల్స్‌ కొనసాగుతాయి’ అని స్టీరింగ్‌ కమిటీ ఎగ్జిక్యూటివ్‌ బృందం తెలిపింది.
డబ్ల్యూహెచ్‌వో నిర్ణయాన్ని ఐసీఎంఆర్‌ డైరెక్టర్‌ జనరల్‌ డాక్టర్‌ బలరామ్‌ భార్గవ స్వాగతించారు. జీవశాస్త్ర సహేతుకత, పరిశోధన సమాచారం, నియంత్రిత అధ్యయనాలను ఆధారం చేసుకొనే హెచ్‌సీక్యూను సూచిస్తున్నామని ఆయన స్పష్టం చేశారు. దశాబ్దాలుగా ఈ మందును ఉపయోగిస్తున్నామని వెల్లడించారు. క్లినికల్‌ ట్రయల్స్‌ ద్వారా వచ్చే సానుకూల ఫలితాలతో ప్రపంచవ్యాప్తంగా ప్రజలకు ప్రయోజనం కలుగుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
ట్రయల్స్‌ను కొనసాగిస్తూ డబ్ల్యూహెచ్‌వో తీసుకున్న నిర్ణయం సరైన దిశగా వేసిన ముందడుగని ఎయిమ్స్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ రణ్‌దీప్‌ గులేరియా అభివర్ణించారు. హెచ్‌సీక్యూ సురక్షితమైందేనని ఎయిమ్స్‌, ఐసీఎంఆర్‌ సంయుక్త డేటా ఆధారంగా తెలుస్తోందన్నారు. దీని ధర తక్కువని, అందరికీ అందుబాటులో ఉంటుందని పేర్కొన్నారు. సూచనల మేరకు వాడితే గుండె, రక్తనాళాల వ్యవస్థ దెబ్బతిన్నట్టు తామెప్పుడూ గుర్తించలేదని వెల్లడించారు. మరికొందరు నిపుణులు సైతం ఇలాంటి అభిప్రాయాలే వ్యక్తం చేస్తున్నారు.