ముంబై నగరంలో అత్యంత జనసమ్మర్ధం కలిగిన రద్దీ ప్రాంతం ధరవి ఆసియా లోనే పెద్ద మురికి వాడగా గుర్తింపు పొందింది. ఇక్కడ ఆలస్యంగా కరోనా వైరస్ ...
ముంబై నగరంలో అత్యంత జనసమ్మర్ధం కలిగిన రద్దీ ప్రాంతం ధరవి ఆసియా లోనే పెద్ద మురికి వాడగా గుర్తింపు పొందింది. ఇక్కడ ఆలస్యంగా కరోనా వైరస్ ప్రవేశించినప్పటికీ వ్యాప్తి చాలా వేగంగా సాగుతోంది. కేసుల సంఖ్య వెయ్యివరకు చేరుకుని ప్రమాద ఘంటికలు మోగిస్తోంది.
కేవలం 45 రోజుల్లోనే 1028 వరకు కేసులు నమోదై 40 మంది ప్రాణాలు కోల్పోయారు. ఏప్రిల్ 1 న డాక్టర్ బాలిగా నగర్‌లో మొదట ఒక కేసు నమోదై ఇప్పుడు ఒక్కసారి నగర పాలక వర్గాన్ని పరుగులెత్తిస్తోంది. 15 రోజుల్లో వంద కేసులు ఉండగా, మే 3 నాటికి 500 దాటాయి. మే 6 నాటికి రెట్టింపు అయ్యాయి. రోగుల్లో మెజార్టీ సంఖ్య 31 నుంచి 40 ఏళ్ల వయస్సు వారే.
ముంబైకు ఉత్తరాన 2.5 చదరపు కిమీ వైశాల్యంలో ఉండే ధరవి లో జనాభా 6.5 లక్షలు. చదరపు కిలో మీటరుకు 2.27,136 వరకు జనసాంద్రత ఉంది. బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ పాలకవర్గం 213 కంటైన్ మెంట్ జోన్లకు నిత్యావసరాలు, మందులు సరఫరా చేస్తున్నారు.
ఇక్కడ ఇళ్లు ఒకదానికి ఇంకొకటి ఆనుకుని దగ్గరగా, కిక్కిరిసినట్టు ఉండడం, ఇరుకు సందులు, పారిశుధ్యం పరిస్థితులు లోపించడం ఇవన్నీ కరోనా వ్యాప్తికి కారణాలని ధరవి పునర్వికాస్ సమితి అధ్యక్షులు రాజు కొర్డే తెలిపారు. కంటైన్‌మెంట్ జోన్లు ఏర్పాటు చేసినా సామాజిక దూరం నిబంధనలు ఇక్కడ చెల్లుబాటు కావని చెప్పారు.
వాలంటీర్లు శానిటైజర్లను, హోమియోపతి మందులను సరఫరా చేస్తున్నారు. పాలకవర్గాల లెక్కల ప్రకారం ధరవిలో మొత్తం 225 కమ్యూనిటీ మరుగుదొడ్లు ఉన్నాయి. 100 పబ్లిక్ టాయ్‌లెట్లు ఉన్నాయి. మహారాష్ట్ర హౌసింగ్, ఏరియా డెవలప్‌మెంట్ అథారిటీ నిర్మించిన 125 టాయ్‌లెట్లు ఉన్నాయి. ఈ మరుగుదొడ్లను వందలాది మంది వినియోగిస్తుంటారు.
ధరవిలో 9 మున్సిపల్ డిస్పెన్సరీలు, 50 ప్రైవేట్ క్లినిక్‌లు ఉన్నాయి. ఇవికాక మరికొన్ని ఫీవర్ క్లినిక్‌లు ఉన్నాయి. ఎక్కువ రిస్కు ఉన్న జోన్లకు చెందిన 47500 మందికి, కంటైన్‌మెంట్ జోన్లలో ఉన్న 1.2 5 లక్షల మందికి స్క్రీనింగ్ జరిగింది. ఇప్పటివరకు దాదాపు 4 లక్షల మందికి 24 మంది ప్రైవేట్ డాక్టర్లచే స్క్రీనింగ్ జరిపారు.