కరోనా కారణంగా ఏర్పడిన ఆర్ధిక దుర్బలత్వాన్ని ఎదుర్కోవడానికి రూ 20 లక్షల కోట్ల ఆర్ధిక ప్యాకేజీని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రకటించారు. ...
కరోనా కారణంగా ఏర్పడిన ఆర్ధిక దుర్బలత్వాన్ని ఎదుర్కోవడానికి రూ 20 లక్షల కోట్ల ఆర్ధిక ప్యాకేజీని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రకటించారు. దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తూ అన్ని వర్గాలకు, రంగాలకు ఈ ప్యాకేజి ద్వారా చేయూత ఇవ్వనున్నట్లు తెలిపారు. మన జీడీపీలో 10 శాతంగా ఈ మొత్తం ఉంటుందని చెప్పారు. ప్యాకేజి వివరాలను ఆర్ధిక మంత్రి ప్రకటింస్తారని పేర్కొన్నారు.
‘ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్’ పేరుతో ఆర్థిక ప్యాకేజీని రూపొందించినట్లు తెలిపారు. భూమి, కార్మికులు, ద్రవ్య అందుబాటులకు బలం చేకూర్చేలా ప్యాకేజీ ఉండనుందని మోదీ స్పష్టం చేశారు. ప్యాకేజీతో సూక్ష్మ, మధ్యతరహా పరిశ్రమలకు ఊతమిస్తున్నట్లు ఆయన వెల్లడించారు.
నూతన ఉద్యోగ, ఉపాధి అవకాశాల కల్పనకు ఈ ప్యాకేజీ దోహదపడుతుందని, ప్రతి పారిశ్రామికుల్ని కలుపుకొనిపోయేలా ప్యాకేజీ ఉంటుందని ప్రధాని మోదీ వెల్లడించారు. సర్కార్ నుంచి వెళ్లే ప్రతి రూపాయి ప్రతి శ్రామికుడు, రైతు జేబులోకి వెళ్తుందని మోదీ ప్రకటించడం విశేషం.
21వ శతాబ్ధపు ఆకాంక్షలకు తగినట్లు ప్యాకేజీ రూపకల్పన చేసినట్లు మోదీ ప్రకటించారు. సంఘటిత, అసంఘటిత కార్మికులందర్నీ ప్యాకేజీతో ఆదుకుంటామని ప్రధాని మోదీ భరోసా ఇచ్చారు.
కాగా, నాలుగో విడత లాక్‌డౌన్ ను రాష్ట్ర ప్రభుత్వాలతో చర్చించి రూపొందిస్తామని చెబుతూ లాక్‌డౌన్ మరింతకొంత కాలం పొడగింపు ఉంటుందని మోదీ వెల్లడించారు. లాక్‌డౌన్ 4వ దశ ఉంటుందని చెబుతూ ఈ సారి నిబంధనలు వినూత్నంగా ఉండగలవని సంకేతం ఇచ్చారు.
ప్రపంచ వ్యాప్తంగా 42 లక్షల మందికి కరోనా సోకిందని, దాదాపు 2.75 లక్షల మంది మరణించారని, మొత్తం ప్రపంచాన్ని అస్తవ్యస్తం చేసిందని చెబుతూ తమ జీవితంలో ఎవరూ ఇలాంటి ఉపద్రవాన్ని కనీవిని ఎరుగరని మోదీ తెలిపారు. మానవజాతికి ఇది ఊహాతీతమని.. అలసిపోవద్దు, ఓడిపోవద్దు, కుంగిపోవద్దు, పోరాటంతోనే ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఈ సంక్షోభం కంటే మన సంకల్పం గొప్పది పేర్కొన్నారు.
‘ఈ యుద్దంలో ప్రతీ ఒక్కరు నియమ నిబంధనలను పాటించాలి. కరోనా కంటే ముందుగా ఉన్న ప్రపంచం ఏంటో మనకు తెలుసు. కరోనా సంక్షోభం తరువాత మారుతున్న ప్రపంచాన్ని మనం చూస్తున్నాం. ఆత్మా నిర్భర్ భారత్... మన లక్ష్యం కావాలి' అని సూచించారు. శాస్త్రాలు చెప్పింది కూడా ఇదే అన్నారు.
కరోనా ప్రారంభం అయినప్పుడు, దేశంలో ఒక్క పీపీఈ కిట్ కూడా తయారయ్యేది కాదని గుర్తు చేస్తూ నేడు భారత్‌లో ప్రతీ రోజు 2లక్షల పీపీఈ కిట్స్, 2లక్షల ఎన్-95 మాస్క్‌లు తయారవుతున్నాయని తెలిపారు. ఆపదను అవకాశంగా మార్చుకున్నామని, స్వయం సంవృద్ధి సాధించే దిశలో భారత్ వేగంగా ముందుకు పోతోందని ప్రధాని భరోసా వ్యక్తం చేసారు.
భారత సంస్కృతి, సాంప్రదాయం మన స్వయం సంవృద్ది గురించి చెబుతాయి. మొత్తం ప్రపంచాన్ని కుటుంబంగా చూసే సంస్కృతి మనది. ఈ భూమిని తల్లిగా భావించే ఆలోచన ఈ దేశానిది. అలాంటి మన దేశం స్వయం సంవృద్ది వైపు సాగితే. దీని ప్రభావం మొత్తం ప్రపంచానికి శుభపరిణామం అని మోదీ విశ్వాసం వ్యక్తం చేశారు.