Page Nav

HIDE

Grid

GRID_STYLE

Pages

latest

షర్మిల సోషల్ మీడియా లో దుస్ప్రచారము పై హైదరాబాదు లో కేసు

సోషల్‌మీడియాలో తనపై, తన కుటుంబ సభ్యులపై అభ్యంతరకర​ వ్యాఖ్యలు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని, హైదరాబాద్‌ నగర పోలీస్‌ కమిషనర్‌ అంజనీ కుమార్‌...


సోషల్‌మీడియాలో తనపై, తన కుటుంబ సభ్యులపై అభ్యంతరకర​ వ్యాఖ్యలు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని, హైదరాబాద్‌ నగర పోలీస్‌ కమిషనర్‌ అంజనీ కుమార్‌కు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు, ప్రతిపక్షనేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి సోదరి వైఎస్‌ షర్మిళ ఫిర్యాదు చేశారు. సోమవారం ఉదయం షర్మిళ, భర్త అనిల్‌ కుమార్‌తో కలిసి కమిషనర్‌ కార్యాలయానికి వెళ్లారు. వీరితో పాటూ కమిషనర్‌ను కలిసిన వారిలో వైఎస్సార్‌సీపీ సీనియర్‌ నాయకులు వైవీ సుబ్బారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, వాసిరెడ్డి పద్మ ఉన్నారు.


తనపై చేస్తున్న అభ్యంతర వ్యాఖ్యల వెనుక టిడిపి హస్తం ఉన్నదని షర్మిళ సంచలన ఆరోపణలు చేశారు. తన వ్యక్తిత్వాన్ని కించపరిచేలా సోషల్‌మీడియాలో పోస్టులు పెట్టడం బాధాకరమని పేర్కొన్నారు. '2014 ఎన్నికలకు ముందు ఎప్పుడో మొదలు పెట్టి, నాకు సినీ హీరో ప్రభాస్‌కు సంబంధం ఉంది అని ఓ వర్గం ఆన్‌లైన్‌లో దుష్ప్రచారాన్ని చేసింది. ఎన్నికల తరువాత దీనిపై ఫిర్యాదు కూడా చేశాము. పోలీసుల విచారణ అనంతరం, చర్యలు తీసుకోవడంతో కొంత కాలం  ఈ దుష్ప్రచారం ఆగింది' అని ఆమె పేర్కొన్నారు.

అయితే మళ్లీ ఎన్నికలు వస్తూ ఉండడంతో ఈ విషప్రచారానికి మళ్లీ వేగం పెంచారని ఆమె తెలిపారు. వీరి ఉద్దేశం ఒక్కటే తన  వ్యక్తిత్వాన్ని హననం చేయడమేనని ఆమె మండిపడ్డారు. ఈ ప్రచారాలను సృష్టిస్తున్నవారిమీద, వారి వెనకున్న వారి మీద చర్యలు తీసుకోవాలని కమిషనర్‌ను కలిశామని చెప్పారు. ఇది తన ఒక్కదానికే జరిగిన అవమానంగా భావించడం లేదని చెబుతూ ఇలాంటి రాతలు ఇంకా ఎంతో మంది మహిళల మీద కూడా రాస్తున్నారని ఆమె చెప్పారు. స్త్రీల పట్ల ఇంత పైశాచికంగా, ఇంత చులకన భావంతో రాస్తున్న రాతలను, దుష్ప్రచారాన్ని, మన సమాజం ఆమోదించవచ్చా ?అని ప్రశ్నించాహ్రూ.

వాస్తవానికి జీవితంలో ప్రభాస్‌ను ఎప్పుడూ తాను కలవలేదని,  ఆయనతో మాట్లాడలేదని ఆమె స్పష్టం చేశారు. ప్రజాస్వామ్యం, మానవహక్కులు, సమానత్వం లాంటి గొప్ప గొప్ప పదాలు కాగితాలకు, చర్చలకు మాత్రమే పరిమితం కాకూడదని ఆమె స్పష్టం చేశారు.  ఇవి వాస్తవరూపం దాల్చాలంటే మనం గొంతెత్తాల్సిన అవసరం ఉందని చెప్పుకొచ్చారు. సామాజిక మాధ్యమాల్లో ఇలాంటి ప్రచారాలకు వీలు లేకుండా కఠిన చర్యలు తీసుకోవాలన్న తన ఫిర్యాదుకు ప్రజాస్వామ్యవాదులు, జర్నలిస్టులు, మహిళలు మద్దతు పలకాలని ఆమె కోరారు.

నాపై దుష్ప్రచారాల వెనుక టీడీపీ హస్తం ఉందని అనుమానం లేకుండా ఆరోపణ చేస్తున్నాను. టీడీపీకి పుకార్లు పుట్టించడం కొత్త కాదు గతంలో మా నాన్న ఫ్యాక్షనిస్టు, మా అన్న గర్విస్టు, కోపిష్టి అని టీడీపీ పుకార్లు పుట్టించింది. నాపై పుకార్లు పుట్టిస్తుంది కూడా టీడీపీనే. టీడీపీ వాళ్లకు సంబంధం లేకుంటే ఎందుకు ఖండించలేదు. స్వయంగా చంద్రబాబు లాంటి వాళ్లే ఇలాంటి వాటిని ప్రోత్సహిస్తారు.. టీడీపీ నాయకులు అనుసరిస్తారుఅని షర్మిళ ఆరోపించారు.

అంతటితో ఆగని షర్మిళ చంద్రబాబుపై కూడా ఆరోపణలు చేశారు. "చంద్రబాబు ఇంట్లో ఆడవాళ్లు లేరా?. మేం పుకార్లు పుట్టించాలి.. అనుకుంటే మేం పుట్టించలేమా?. మాకు తెలివి లేకా కాదు.. పుట్టించలేకా కాదు. మేం అలా చేయలేదంటే కారణం.. మాకు విలువలున్నాయి. చంద్రబాబు డిక్షనరీలో విలువ, ఎథిక్స్‌ అనే పదాలే లేవు. చంద్రబాబు లాంటి వాళ్లు అధికారంలో ఉన్నన్ని రోజులు సమాజం బాగుపడదుఅని బాబుపై షర్మిళ తీవ్ర ఆరోపణలు చేశారు.

అయితే ఏపీలో ఫిర్యాదు చేయకుండా ఇక్కడెందుకు చేశారని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా.. ఆంధ్రా పోలీసులపై మాకు నమ్మకం లేదని.. అందుకే హైదరాబాద్‌ వచ్చి ఫిర్యాదు చేసినట్లు షర్మిళ బదులిచ్చారు. ఇలా దుష్ప్రచారం చేస్తున్న వారిపై తప్పకుండా కఠిన చర్యలు తీసుకుంటామని సీపీ హామీ ఇచ్చారని షర్మిళ చెప్పుకొచ్చారు.