అయోధ్యలో రామ మందిరం నిర్మాణానికి తక్షణం ప్రత్యేక చట్టం రూపొందించాల్సిన అవసరం ఎంతైనా ఉందని విశ్వ హిందూ పరిషత్ స్పష్టం చేసింది. మందిరం విషయం...
అయోధ్యలో రామ మందిరం నిర్మాణానికి తక్షణం ప్రత్యేక చట్టం రూపొందించాల్సిన అవసరం ఎంతైనా ఉందని విశ్వ హిందూ పరిషత్ స్పష్టం చేసింది. మందిరం విషయంలో కోర్టుల జోక్యంతో మరింత జాప్యం జరుగుతోందని వీహెచ్‌పీ అంతర్జాతీయ అధ్యక్షుడు విష్ణు సదాశివ్ కొక్జే ఆందోళన వ్యక్తం చేశారు. కోర్టుల ప్రమేయంతో మందిరం నిర్మాణంలో విశ్వాసం సన్నగిల్లుతున్న నేపథ్యంలో కేంద్రం స్పందించి ప్రత్యేక చట్టం రూపొందించాలని డిమాండ్ చేశారు.
ప్రస్తుత పరిస్థితుల్లో అయోధ్యలో రామ మందిరం వివాదం పరిష్కారం కావాలంటే కోర్టులతో అంత త్వరగా అయ్యే పనికాదని ఆయన అభిప్రాయపడ్డారు. మతపరమైన విశ్వాసాలు న్యాయస్థానాల పరిధికి కిందకు రావని ఆయన తెలిపారు. అందువల్లే త్వరితగతిన రామ మందిరం నిర్మాణం చేపట్టేందుకు కేంద్ర ప్రభుత్వం సరికొత్త చట్టాన్ని రూపొందించాలని తాము కోరుతున్నామని ఆయన పేర్కొన్నారు.
అయోధ్య అంశం సుప్రీం కోర్టు పరిధిలో ఉండడంతో మరింత జాప్యం జరుగుతోందని, కనుక రానున్న రోజుల్లో మంచిరోజులు వస్తాయని తాము భావిస్తున్నామని చెప్పారు. మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల హైకోర్టుల్లో మాజీ న్యాయమూర్తిగా పనిచేసిన విష్ణు సదాశివ్ కొక్జీ ‘అయోధ్యలో రాముడు పుట్టాడా లేదా అన్న అంశాన్ని ఏ కోర్టు కూడా నిర్ణయాన్ని చెప్పలేదు. అందువల్లే రామ మందిరం నిర్మాణానికి వీలుగా ప్రత్యేక చట్టం రూపొందించాలని మేము మొదటినుంచి డిమాండ్ చేస్తున్నాం. లేకుంటే సమస్య పరిష్కారానికి మరింత జాప్యం జరుగుతుంది’ అని ఆయన పేర్కొన్నారు.