Page Nav

HIDE

Grid

GRID_STYLE

Pages

latest

అయోధ్య కేసు వాయిదా పడింది

అయోధ్యలోని రామ జన్మభూమి- బాబ్రీ మసీదు స్థల వివాదంపై కేసు విచారణను సుప్రీంకోర్టులో ఈ రోజు ప్రారంభం కాగలదని ఎదురు చుసిన వారికి మరోసారి ని...

అయోధ్యలోని రామ జన్మభూమి- బాబ్రీ మసీదు స్థల వివాదంపై కేసు విచారణను సుప్రీంకోర్టులో ఈ రోజు ప్రారంభం కాగలదని ఎదురు చుసిన వారికి మరోసారి నిరుత్సాహం ఎదురైనది. ఇంకోసారి కేసు వాయిదా పడింది. ఇప్పుడు జనవరి 29న తిరిగి ఈ కేసు కోర్ట్ ముందుకు రానుంది. 
ఈ కేసులో వాదనలు వినేందుకు ఐదుగురు న్యాయమూర్తులతో రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటుచేసిన విషయం తెలిసిందే. ఈ ధర్మాసనం గురువారం విచారణ ప్రారంభించింది. అయితే బెంచ్‌లో ఒకరైన జస్టిస్‌ యు.లలిత్‌ విచారణ నుంచి తప్పుకోవడంతో తదుపరి విచారణను జనవరి 29కి వాయిదా వేసింది. ఈ కేసులో కొత్త రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటుచేస్తామని ప్రధాన న్యాయమూర్తి రంజాన్ గొగోయ్ వెల్లడించారు. 
అయోధ్య కేసు విచారణ కోసం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గొగొయి నేతృత్వంలో న్యాయమూర్తులు జస్టిస్‌ ఎస్‌.ఎ. బోబ్డే, జస్టిస్‌ ఎన్‌.వి. రమణ, జస్టిస్‌ యు.లలిత్‌, జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌లతో రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటైంది. గురువారం ఈ ధర్మాసనం వాదనలు ప్రారంభించింది. అయితే బెంచ్‌లో జస్టిస్‌ లలిత్‌ ఉండటంపై సీనియర్‌ న్యాయవాది రాజీవ్‌ ధవన్‌ అభ్యంతరం వ్యక్తం చేశారు. 
జస్టిస్‌ లలిత్‌ గతంలో ఇదే కేసులో కల్యాణ్‌సింగ్‌ తరఫున వాదించారు. దీంతో రాజ్యాంగ ధర్మాసనంలో జస్టిస్‌ లలిత్‌ సభ్యులుగా ఉండటంపై న్యాయవాది ధవన్‌ అసంతృప్తి వ్యక్తం చేశారు. దీంతో జస్టిస్ లలిత్‌ విచారణ నుంచి తప్పుకున్నారు. ఈ నేపథ్యంలో విచారణను సుప్రీంకోర్టు వాయిదా వేసింది. అయోధ్య కేసులో జనవరి 29 నుంచి కొత్త ధర్మాసనం వాదనలు వింటుందని అత్యున్నత న్యాయస్థానం పేర్కొంది. 
2.77 ఎకరాల వివాదాస్పద భూమిని సున్నీ వక్ఫ్‌బోర్డు, నిర్మోహి అఖాడా, రామ్‌లల్లా మధ్య సమానంగా పంపిణీ చేయాలని 2010లో అలహాబాద్‌ హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఈ తీర్పుతో సంతృప్తి చెందని పలువురు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. వ్యక్తులు, ధార్మికసంస్థల తరఫున 14 వ్యాజ్యాలు దాఖలయ్యాయి. వ్యాజ్యాలను పరిశీలించిన సుప్రీంకోర్టు.. 2019 జనవరి మొదటివారంలో ధర్మాసనానికి నివేదిస్తామని గత ఏడాది అక్టోబరు 29న పేర్కొంది. విచారణ నిమిత్తం గత మంగళవారం రాజ్యాంగ ధర్మాసనాన్ని ఏర్పాటుచేసింది.