తెలంగాణ ముఖ్యమంత్రిగా రెండోసారీ ఘనంగా పీఠమెక్కిన కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు, తెలంగాణ రాష్ట్ర సమితికి సంబంధించి కీలక బాధ్యతల్ని తన ...
తెలంగాణ ముఖ్యమంత్రిగా రెండోసారీ ఘనంగా పీఠమెక్కిన కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు, తెలంగాణ రాష్ట్ర సమితికి సంబంధించి కీలక బాధ్యతల్ని తన పుత్రరత్నం కల్వకుంట్ల తారకరామారావుకి అప్పగించారు. టీఆర్‌ఎస్ చరిత్రలో తొలిసారిగా వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్ట్‌ని ప్రకటించిన కేసీఆర్, ఆ పదవిలో తన కుమారుడు కేటీఆర్‌ని కూర్చోబెట్టారు.
పార్టీ పరంగా కేసీఆర్, అత్యంత వ్యూహాత్మక నిర్ణయం తీసుకున్నారనీ, ఇకపై టీఆర్‌ఎస్‌లో కేటీఆర్ రోల్ మరింత యాక్టివ్‌గా మారుతుందనీ, దేశ రాజకీయాలపై కేసీఆర్ దృష్టిపెట్టనున్న దరిమిలా.. ఈ నిర్ణయం పార్టీని కొత్తపుంతలు తొక్కిస్తుందని టీఆర్‌ఎస్ శ్రేణులు అభిప్రాయపడ్తున్నాయి.
త్వరలో జరగనున్న పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలోనే కేసీఆర్ ఈ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. 2019 ఎన్నికల్లో టీఆర్‌ఎస్, 16 ఎంపీ సీట్లను గెల్చుకుంటే.. కేసీఆర్ పూర్తిగా జాతీయ రాజకీయాలకే పరిమితమవుతారనీ, అందుకు తగ్గట్టుగానే కేటీఆర్‌ని తన వారసుడిగా కేసీఆర్ ప్రకటించారనీ రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడ్తున్నారు.
గత కొంతకాలంగా టీఆర్‌ఎస్‌లో 'వారసత్వం' గురించిన చర్చ జరుగుతోంది. హరీష్‌రావు, కవిత, కేటీఆర్ మధ్య వారసత్వ పోరు నడుస్తోందంటూ ఊహాగానాలు విన్పిస్తోన్న విషయం విదితమే. గ్రేటర్ హైద్రాబాద్ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కి బంపర్ విక్టరీ అందించిన కేటీఆర్, ఆ తర్వాత సైతం పార్టీని పరుగులు పెట్టించారు.
తండ్రికి తగ్గ తనయుడే కాదు, తండ్రిని మించిన తనయుడన్న గుర్తింపు తెచ్చుకున్న కేటీఆర్, తాజా అసెంబ్లీ ఎన్నికల్లోనూ టీఆర్‌ఎస్‌కి సంచలన విజయాన్ని అందించారు. అభ్యర్థుల ఎంపిక దగ్గర్నుంచి, అసంతృప్తుల బుజ్జగింపు వరకు.. అన్నీ కేటీఆర్ చూసుకోవడంతో, ఎన్నికల ప్రచారాన్ని కేసీఆర్ సులువుగా చేపట్టగలిగారు.
కేటీఆర్ సమర్థత తాజా అసెంబ్లీ ఎన్నికలతో బయటపడిందని పార్టీ నేతలకు పరిస్థితిని వివరించిన కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్ట్‌పైనా ఎలాంటి వివాదాలకూ తావులేకుండా జాగ్రత్తపడ్డారు. జాతీయ స్థాయిలో కేసీఆర్ చక్రంతిప్పే పరిస్థితి వస్తే, తెలంగాణ ముఖ్యమంత్రిగా కేటీఆర్ బాధ్యతలు స్వీకరించనున్నారని తాజా పరిణామాల్ని బట్టి విశ్లేషించొచ్చు.