అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ (ఏఎమ్‌యూ) విద్యార్థి సంఘం ఎన్నికల్లో ఒక్క హిందూ అభ్యర్థి కూడా విజయం సాధించలేదు. మొత్తం 28 స్థానాలకు జరిగిన ఎన్ని...

అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ (ఏఎమ్‌యూ) విద్యార్థి సంఘం ఎన్నికల్లో ఒక్క హిందూ అభ్యర్థి కూడా విజయం సాధించలేదు. మొత్తం 28 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో ముస్లిం అభ్యర్థులే అన్నింటినీ కైవసం చేసుకున్నారు. వర్సిటీ విద్యార్థుల్లో దాదాపు 20 శాతం మంది హిందువులు ఉన్నప్పటికీ ఈ ఫలితాలు వచ్చాయి.
విద్యార్థి సంఘం, మహిళా కళాశాల యూనియన్, కోర్టు స్థానాలకు ఈ ఎన్నికలు నిర్వహించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా పలువురు అభ్యర్థులు మతపరమైన అంశాలను ప్రధానంగా ప్రస్తావించారు. ఏఎమ్‌యూ విద్యార్థి సంఘం పనితీరు ఇస్లామిక్ రాజ్యాన్ని తలపిస్తోందని విశ్లేషకుడు ఇబ్న్ ఖల్దూన్ భారతి పేర్కొన్నారు. ఇక్కడ పోటీ చేసే హిందూ అభ్యర్థులు ప్రచారం కోసం షేర్వానీ, జిన్నా టోపీ ధరించాల్సిన పరిస్థితి నెలకొందని ఆయన తెలిపారు.
యూనియన్ అధ్యక్షుడిగా గెలిచిన నోమన్ అష్రఫ్ పాలస్తీనా, ఇరాన్, సుడాన్ ముస్లింల విజయం గురించి మాట్లాడారు. వైస్ ప్రెసిడెంట్ నష్రా నయీమ్ కెఫియే ధరించి, జిహాద్‌కు సంబంధించిన సూరా ముహమ్మద్ 47:7 సూక్తితో ప్రసంగాన్ని ప్రారంభించారు. సెక్రటరీ మహమ్మద్ హమ్దాన్ నారా-ఎ-తక్బీర్ నినాదాలు చేశారు. గతంలో 1990-91 ఎన్నికల్లో హిందూ అభ్యర్థి గెలవకుండా ఉండేందుకు ముస్లిం అభ్యర్థులు క్యాంపస్ జామా మసీదులో ఖురాన్‌పై ప్రమాణం చేసి ఒకే ఉమ్మడి అభ్యర్థిని నిలబెట్టారు.
కేంద్ర ప్రభుత్వ నిధులతో నడుస్తున్న ఏఎమ్‌యూ, మైనారిటీ హోదా పేరుతో రాజ్యాంగబద్ధమైన ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లను అమలు చేయడం లేదు. 2024 నవంబర్‌లో సుప్రీంకోర్టు ఏడుగురు న్యాయమూర్తుల ధర్మాసనం 1967 నాటి అజీజ్ బాషా తీర్పును పక్కనపెట్టి, ఏఎమ్‌యూ మైనారిటీ హోదా అంశాన్ని సాధారణ ధర్మాసనానికి అప్పగించింది. 1875లో సయ్యద్ అహ్మద్ ఖాన్ స్థాపించిన కళాశాల కాలక్రమంలో ఏఎమ్‌యూగా రూపాంతరం చెందింది.