కోల్‌కతా ఉత్తర శివార్లలోని కేశ్‌తోపూర్‌లో 'భారత్ మాత ముర్దాబాద్' అంటూ నినాదాలు చేసిన వ్యక్తిని స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగ...

కోల్‌కతా ఉత్తర శివార్లలోని కేశ్‌తోపూర్‌లో 'భారత్ మాత ముర్దాబాద్' అంటూ నినాదాలు చేసిన వ్యక్తిని స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. నిందితుడిని ఎనాముల్ మొల్లాగా గుర్తించారు. బాగుయాటి పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని దర్యాప్తు ప్రారంభించారు.
నవంబర్ 14న కేశ్‌తోపూర్‌లో ఒక కార్యక్రమానికి వెళ్తున్న ప్రభుత్వ బస్సులోని ప్రయాణికులు 'భారత్ మాతా కీ జై' అంటూ నినాదాలు చేశారు. ఆ సమయంలో పక్కనే ఉన్న మరో బస్సులో ప్రయాణిస్తున్న ఎనాముల్ మొల్లా ప్రతిగా 'భారత్ మాత ముర్దాబాద్' అంటూ నినాదాలు చేశాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఫేస్‌బుక్‌లో వైరల్ కావడంతో స్థానికుల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది.
వీడియో ఆధారంగా స్థానికులు వారం రోజుల పాటు నిందితుడి కోసం గాలించారు. చివరకు నవంబర్ 21న అతడిని గుర్తించి చుట్టుముట్టారు. అనంతరం అతనికి దేహశుద్ధి చేసి బాగుయాటి పోలీసులకు అప్పగించారు. ఎనాముల్ మొల్లా ఉత్తర 24 పరగణాల జిల్లాలోని హబ్రాకు చెందినవాడని, కేశ్‌తోపూర్‌లోని వార్డు నంబర్ 26లో ఉన్న ఒక మాంసం దుకాణంలో సహాయకుడిగా పనిచేస్తున్నాడని వెల్లడైంది.
ప్రస్తుతం పోలీసులు నిందితుడిని కస్టడీలోకి తీసుకుని సామాజిక మాధ్యమాల్లో వచ్చిన వీడియోను పరిశీలిస్తున్నారు. మొల్లా నేపథ్యం ఏమిటి, అతనికి ఎవరితో సంబంధాలు ఉన్నాయనే కోణంలో బాగుయాటి పోలీసులు విచారణ జరుపుతున్నారు.