లెబనాన్‌లోని బెకా వ్యాలీ ప్రాంతంపై ఇజ్రాయెల్ దాడులు నిర్వహించింది. ఈ దాడుల్లో 10 మంది ప్రాణాలు కోల్పోగా 50 మంది గాయపడ్డారని ఇద్దరు భద్రతా అ...

లెబనాన్‌లోని బెకా వ్యాలీ ప్రాంతంపై ఇజ్రాయెల్ దాడులు నిర్వహించింది. ఈ దాడుల్లో 10 మంది ప్రాణాలు కోల్పోగా 50 మంది గాయపడ్డారని ఇద్దరు భద్రతా అధికారులు తెలిపారు.
ఇజ్రాయెల్ సైన్యం జరిపిన ఈ దాడుల్లో లెబనాన్‌లోని బెకా వ్యాలీ పరిధిలోని బాల్బెక్ ప్రాంతంలో ఉన్న హిజ్బుల్లా కమాండ్ సెంటర్లను టార్గెట్ చేసినట్లు ఇజ్రాయెల్ వెల్లడించింది. మూడు వేర్వేరు కమాండ్ సెంటర్లలో హిజ్బుల్లా క్షిపణి విభాగం నుంచి పలువురు ఉగ్రవాదులను హతమార్చినట్లు సైన్యం తెలిపింది. ఇజ్రాయెల్‌పై దాడులకు ప్లాన్ చేస్తున్నందునే తాము ఈ చర్యలు తీసుకున్నామని పేర్కొంది. లెబనాన్ సరిహద్దుకు సుమారు 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఐన్ అల్-టినా సమీపంలో రద్వాన్ ఫోర్స్ శిక్షణా శిబిరంలో డజన్ల కొద్ది హిజ్బుల్లా రాకెట్లు, లాంచర్లపై దాడి చేసినట్లు ఐడీఎఫ్ తెలిపింది.
శుక్రవారం జరిగిన ఈ దాడుల్లో ఒక కమాండర్ హుస్సేన్ మొహమ్మద్ యాఘీతో సహా తమ యోధులు ఎనిమిది మంది మృతి చెందినట్లు శనివారం హిజ్బుల్లా ప్రకటించింది. ఈ దాడులను తీవ్రంగా ఖండించిన హిజ్బుల్లా అధికారి మహ్మద్ కమాటి, తమ దేశాన్ని రక్షించుకోవడానికి ప్రతిఘటన ఒక్కటే తమ ముందున్న ఏకైక మార్గమని స్పష్టం చేశారు. అల్-అఖ్బర్ పత్రిక కథనం ప్రకారం, ఈ దాడులు అమెరికా-ఇరాన్ మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందాన్ని ప్రభావితం చేసే అవకాశం ఉందని విశ్లేషించింది. మార్చి 2, 2026కు ముందు ఉన్నట్లుగా లెబనాన్‌లో ఎక్కడైనా దాడులు చేసే స్వేచ్ఛను తిరిగి పొందాలని ఇజ్రాయెల్ భావిస్తోందని ఆ పత్రిక ఆరోపించింది.
లెబనాన్ అధ్యక్షుడు జోసెఫ్ సౌన్ ఈ దాడులను లెబనాన్ సార్వభౌమత్వానికి భంగం కలిగించే కొత్త ఉల్లంఘనగా అభివర్ణించారు. హమాస్ కూడా ఈ దాడిని ఖండించింది. దక్షిణ లెబనాన్‌లోని అతిపెద్ద పాలస్తీనియన్ శరణార్థి శిబిరంపై జరిగిన మరో దాడిలో ఇద్దరు మృతి చెందినట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఈ దాడులు అమెరికా మద్దతుతో కుదిరిన పెళుసైన కాల్పుల విరమణ ఒప్పందాన్ని పరీక్షించేలా ఉన్నాయని పలు నివేదికలు పేర్కొన్నాయి.