యూదులను లక్ష్యంగా చేసుకుని దాడులకు పాల్పడిన ఇద్దరు వ్యక్తులపై ఆస్ట్రేలియా ప్రభుత్వం ఉగ్రవాద నిధుల నిరోధక ఆంక్షలు విధించింది. ఇరాన్‌కు చెంది...
యూదులను లక్ష్యంగా చేసుకుని దాడులకు పాల్పడిన ఇద్దరు వ్యక్తులపై ఆస్ట్రేలియా ప్రభుత్వం ఉగ్రవాద నిధుల నిరోధక ఆంక్షలు విధించింది. ఇరాన్‌కు చెందిన ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (ఐఆర్‌జీసీ) తరఫున సిడ్నీ, మెల్బోర్న్‌లలో వీరు దాడులు చేయించారని విదేశాంగ మంత్రి పెన్నీ వాంగ్ కార్యాలయం వెల్లడించింది.
ఆస్ట్రేలియా ప్రభుత్వం జోహైర్ హసీబ్, కాజెమ్ హమద్ అనే ఇద్దరు వ్యక్తుల పేర్లను తొలిసారిగా బహిరంగంగా ప్రకటించింది. 2024లో సిడ్నీలోని లూయిస్ కాంటినెంటల్ కిచెన్, మెల్బోర్న్‌లోని అదాస్ ఇజ్రాయెల్ సినగాగ్‌లపై జరిగిన యూదు వ్యతిరేక దహన దాడుల వెనుక వీరి ప్రమేయం ఉందని ప్రభుత్వం గుర్తించింది. వివిధ మధ్యవర్తుల ద్వారా వీరు ఈ దాడులను నడిపించినట్లు అధికారులు తెలిపారు.
ఈ ఇద్దరి కార్యకలాపాల వివరాలను జూన్ నెలలో విడుదల చేసిన ఆస్ట్రేలియన్ సెక్యూరిటీ ఇంటెలిజెన్స్ ఆర్గనైజేషన్ (ఏఎస్ఐఓ) వార్షిక ముప్పు అంచనా నివేదికలో పేర్కొన్నారు. టెహ్రాన్ మద్దతుగల నెట్‌వర్క్‌లకు ఆర్థిక వనరులు అందకుండా కట్టడి చేయడమే ఈ ఆంక్షల ముఖ్య ఉద్దేశమని ఆస్ట్రేలియా ప్రభుత్వం స్పష్టం చేసింది. ఉగ్రవాదులు నిధులు సమీకరించడం, దాడులకు ప్రణాళికలు రచించడం అడ్డుకోవడానికి ఈ చర్య ఉపయోగపడుతుందని వివరించింది.
ఆస్ట్రేలియా చట్టాల ప్రకారం హసీబ్, హమద్‌ల ఆస్తులను వినియోగించినా లేదా వారికి ఆర్థిక సహాయం అందించినా నేరంగా పరిగణిస్తారు. ఈ ఆంక్షలను ఉల్లంఘిస్తే పదేళ్ల వరకు జైలు శిక్షతో పాటు భారీ జరిమానా విధిస్తారు. క్రిమినల్ కోడ్ యాక్ట్ 1995 కింద ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే దేశంతో సంబంధాలు కొనసాగించినందుకు అదనపు చర్యలు కూడా ఉంటాయి.
ఆల్బనీస్ ప్రభుత్వం విదేశీ జోక్యం, ఉగ్రవాద కార్యకలాపాలపై కఠినంగా వ్యవహరిస్తుందని అధికార వర్గాలు తెలిపాయి. గతంలోనే ఆస్ట్రేలియా ప్రభుత్వం ఐఆర్‌జీసీని ఉగ్రవాద ప్రోత్సాహక సంస్థగా ప్రకటించింది. ఇరాన్ రాయబారితో పాటు ముగ్గురు దౌత్యవేత్తలను దేశం నుంచి బహిష్కరించడంతో పాటు టెహ్రాన్‌లోని తన రాయబార కార్యాలయ కార్యకలాపాలను సైతం తాత్కాలికంగా నిలిపివేసింది. తాజా నిర్ణయంతో ఆస్ట్రేలియా విధించిన ఉగ్రవాద నిరోధక ఆర్థిక ఆంక్షల జాబితాలో వ్యక్తులు, సంస్థల సంఖ్య 102కి చేరింది.