26/11 ముంబై ఉగ్రదాడుల వార్షికోత్సవం సందర్భంగా అమాయక బాధితులకు భారత్‌లోని అమెరికా రాయబారి సెర్గియో గోర్ గురువారం నివాళులర్పించారు. ఉగ్రవాదంప...

26/11 ముంబై ఉగ్రదాడుల వార్షికోత్సవం సందర్భంగా అమాయక బాధితులకు భారత్‌లోని అమెరికా రాయబారి సెర్గియో గోర్ గురువారం నివాళులర్పించారు. ఉగ్రవాదంపై పోరులో భారత్‌కు అమెరికా ఎల్లప్పుడూ అండగా నిలుస్తుందని ఆయన స్పష్టం చేశారు. ఈ దాడిలో ప్రాణాలు కోల్పోయిన ఆరుగురు అమెరికన్లతో సహా 166 మందిని ఆయన స్మరించుకున్నారు.
ముంబైలోని తాజ్ మహల్ ప్యాలెస్ హోటల్‌లోని స్మారకం వద్ద గతంలో అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియోతో కలిసి నివాళులర్పించిన విషయాన్ని సెర్గియో గోర్ ఎక్స్ వేదికగా గుర్తు చేసుకున్నారు. అమాయక బాధితుల త్యాగాలను స్మరిస్తూ, భారత భద్రతా బలగాల తెగువను కొనియాడారు. ఉగ్రవాదులను చట్టం ముందు నిలబెట్టేందుకు ఇరు దేశాల చట్ట అమలు సంస్థల భాగస్వామ్యం అత్యంత కీలకమని ఆయన పేర్కొన్నారు.
పాకిస్థాన్‌కు చెందిన లష్కరే తొయిబా సంస్థకు చెందిన పది మంది ఉగ్రవాదులు 2008 నవంబర్ 26 రాత్రి సముద్ర మార్గంలో ముంబైలోకి చొరబడ్డారు. ఛత్రపతి శివాజీ టెర్మినస్, లియోపోల్డ్ కేఫ్, కామా ఆసుపత్రి, నారిమన్ హౌస్, మెట్రో సినిమా, తాజ్ మహల్ ప్యాలెస్, ఒబెరాయ్ ట్రైడెంట్ హోటళ్లపై ఏకకాలంలో దాడులకు తెగబడ్డారు. నాలుగు రోజుల పాటు సాగిన ఈ దాడుల్లో 140 మంది భారతీయులు, 23 దేశాలకు చెందిన 26 మంది విదేశీయులు సహా 166 మంది ప్రాణాలు కోల్పోగా, సుమారు 300 మంది గాయపడ్డారు.
ఈ దాడులను తిప్పికొట్టే క్రమంలో 18 మంది భారత పోలీసు అధికారులు, 12 మంది తాజ్ హోటల్ సిబ్బంది విధి నిర్వహణలో అమరులయ్యారు. అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్ తుకారాం ఓంబ్లే ప్రాణత్యాగం చేసి పాకిస్థానీ ఉగ్రవాది అజ్మల్ అమీర్ కసబ్‌ను సజీవంగా పట్టుకున్నారు. మిగిలిన తొమ్మిది మంది ముష్కరులను భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. విచారణ అనంతరం కసబ్‌కు 2010లో ఉరిశిక్ష విధించగా, 2012లో ఉరితీశారు.
గత నెలలో భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్‌తో కలిసి మార్కో రూబియో తాజ్ హోటల్ స్మారకం వద్ద నివాళులర్పించారు. ఆ సమయంలో దాడుల సమయంలో హోటల్‌లోనే ఉన్న సెక్యూరిటీ చీఫ్ సునీల్ కుడ్యాడిని రూబియో కలిసి దాడి జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు.