Page Nav

HIDE

Grid

GRID_STYLE

Pages

latest

కొవిడ్‌ తగ్గిన తరువాత ఎన్ని రోజులకు సెక్స్ చేయొచ్చు - Vandebharat

  కరోనా కల్లోలం కొనసాగుతున్న వేళ ప్రజల్లో రకరకాల భయాలు, సందేహాలు. కొవిడ్‌ వచ్చి తగ్గిన వారిలో ఈ సందేహాలు ఇంకాస్త ఎక్కువ. కొత్త దంపతుల్లో మరీ...


 

కరోనా కల్లోలం కొనసాగుతున్న వేళ ప్రజల్లో రకరకాల భయాలు, సందేహాలు. కొవిడ్‌ వచ్చి తగ్గిన వారిలో ఈ సందేహాలు ఇంకాస్త ఎక్కువ. కొత్త దంపతుల్లో మరీ ఎక్కువగా ఉంటాయి. అలాంటి సందేహాలకు సమాధానాలు అందిచాలని భావించి... ‘ఆంధ్రజ్యోతి’ నిర్వహించిన ముఖాముఖిలో పాల్గొన్న బర్త్‌రైట్‌ బై రెయిన్‌బో ఆస్పత్రి ఇన్‌ఫెర్టిలిటీ స్పెషలిస్టు డాక్టర్‌ ప్రీతిరెడ్డి ఆ విశేషాలు మీకోసం..


కొవిడ్‌ తర్వాత ఎన్ని రోజులు దాంపత్య జీవితానికి దూరంగా ఉండాలి?  

కొవిడ్‌ నుంచి కోలుకున్న తర్వాత కనీసం నెల రోజులు దాంపత్య జీవితానికి దూరంగా ఉండాలి. ఆ తర్వాత శృంగార జీవితాన్ని కొనసాగించ వచ్చు. 


నెగెటివ్‌ వచ్చిన రెండు వారాల తర్వాత కండోమ్స్‌తో శృంగారంలో పాల్గొనవచ్చా? 

ఆరోగ్యపరంగా ఫిట్‌గా ఉండి, శారీరకంగా చురుకుగా ఉంటే పెద్దగా ఇబ్బందులు ఏమీ ఉండవు. 


వీర్యం/యోని స్రావాలలో వైరస్‌ ఉంటుందా? 

వీర్యకణాలలో కొవిడ్‌ వైరస్‌ ఉంటుందా.. ఉండదా.. అనే దానిపై స్పష్టత లేదు. వీర్యకణాల్లో వైర్‌సను గుర్తించామని కొన్ని, లేదని మరికొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. దీనిపై పూర్తి స్థాయి పరిశోధనలు జరగాల్సి ఉంది. అయితే లక్షణాలు ఉన్నప్పుడు శృంగారంలో పాల్గొంటే వైరస్‌ సోకుతుంది. 


కొవిడ్‌ తగ్గాక ముద్దు, ముచ్చట ఉండొచ్చా..?

సాధారణంగా 15 రోజుల తర్వాత నెగెటివ్‌ వస్తుంది. ఆ తర్వాత వైరస్‌ సోకే అవకాశం ఉండదు.  అయినా.. నెల రోజులు దూరంగా ఉండడం మంచిది. 


వీర్యకణాలు, అండాల ఉత్పత్తిపై వైరస్‌ ప్రభావం చూపుతుందా ?

ఇది వైరస్‌ తీవ్రతపై ఆధారపడి ఉంటుంది. తీవ్రత మోస్తరు నుంచి అధికంగా ఉన్న పురుషుల వీర్యం/స్త్రీ అండం ఉత్పత్తి, నాణ్యత, చురుకుదనంపై కొంత ప్రభావం ఉంటుంది. ఇలాంటి సమస్యను కొందరు పురుషుల్లో గుర్తించాం. కొవిడ్‌ రోగుల్లో.. తీవ్ర జ్వరం, ఇన్‌ఫెక్షన్‌, హార్మోన్ల అసమతౌల్యం వంటి సమస్యలు వస్తుంటాయి. ఇలాంటి స్త్రీ/పురుషుల్లో ఇబ్బందులు వస్తున్నాయి. 


ఇందుకు మానసిక ఒత్తిడి కారణమవుతుందా ?

మానసిక ఒత్తిడి కారణమయ్యే అవకాశాలు ఉన్నాయి.  


ఎన్ని రోజుల్లో వీర్య కణాలు సాధారణ స్థితికి వస్తాయి?

కొవిడ్‌ నుంచి కోలుకున్న నెల రోజుల్లో అంతా సాధారణం అయిపోతుంది. కొందరికి రెండు నెలలు పట్టొచ్చు. ఇది వైరస్‌ తీవ్రత మీద ఆధారపడి ఉంటుంది. ఈ తీవ్రత మరీ ఎక్కువగా ఉంటే కొన్ని నెలలు కూడా పట్టొచ్చు. తీవ్రత స్వల్పంగా ఉన్న వారిపై పెద్దగా ప్రబావం ఉండదు. 


అండాశయంపై వైరస్‌ ప్రభావముంటుందా? సంతానం కోసం ఎన్నిరోజులకు ప్రయత్నించొచ్చు?

అండాశయంపై వైరస్‌ ప్రభావం ఉండదు. కానీ, వారికి కూడా ఇవే సూచనలు వర్తిస్తాయి. గర్బం దాల్చడానికి మానసిక, శారీరక పరిస్థితులు అనుకూలంగా ఉండాలి. అందువల్ల.. అంతా బాగున్నప్పుడే సంతానం కోసం ప్రయత్నించడం మంచిది. నెల తర్వాత ఎప్పుడైనా ప్లాన్‌ చేసుకోవచ్చు. కాకపోతే.. ముందుగా డాక్టర్‌ను కలిసి పరీక్షలు చేయించుకోవడం మంచిది.


పిల్లలు కనాలనుకునే వారు వ్యాక్సిన్‌ తీసుకోవచ్చా?

అలాంటి వారు ముందుగానే వ్యాక్సిన్‌ తీసుకోవాలి. రెండు డోసులూ పూర్తయిన 15 రోజుల వరకు గర్భం దాల్చకుండా జాగ్రత్త పడాలి. 


గర్భిణులు వ్యాక్సిన్‌ తీసుకోవచ్చా? 

గర్భిణులు, బాలింతలు వ్యాక్సిన్‌ తీసుకోవద్దని కేంద్ర ప్రభుత్వం చెప్పింది. గర్బిణులు, బాలింతలు, పిల్లలపై ఇంకా మన దేశంలో క్లినికల్‌ ట్రయల్స్‌ జరగలేదు. అందుకే వారికి వ్యాక్సిన్‌ ఇవ్వడం లేదు. 


ప్రసవం తర్వాత ఎన్ని రోజులకు టీకా వేసుకోవాలి?

ప్రసవం తర్వాత నాలుగు నెలలు వ్యాక్సిన్‌ వేసుకోవద్దు. ఆ తర్వాత వేసుకోవడం మంచిది. 


ఫెర్టిలిటీ చికిత్స పొందే దంపతులు వ్యాక్సిన్‌ ఎప్పుడు వేసుకోవాలి?

దంపతుల వయస్సు, వారి ఫెర్టిలిటీని గమనించి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. వయసు ఎక్కువగా ఉన్నవాళ్లు ఇంకా ఆలస్యం చేస్తే ఇబ్బందులు వస్తాయి. అండాల నాణ్యత తగ్గిపోతుంది. సంతానం లేమి సమస్య ఏర్పడే ముప్పు ఉంటుంది. ఇలాంటి దంపతులకు వైరస్‌ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటూ.. వ్యాక్సినేషన్‌ను వాయిదా వేసుకోవాలని సూచిస్తాం. 


పీరియడ్స్‌ సమయంలో వ్యాక్సిన్‌ వేసుకోవచ్చా?

నిర్భయంగా తీసుకోవచ్చు. అనుమానాలు వద్దు.