విశాఖపట్నం: విశాఖ స్టీల్‌ప్లాంట్ కోసం ఉద్యమం ఉధృత రూపం దాల్చింది. ప్రైవేటీకరణపై నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. కూర్మన్నపాలెం స్టీల్ ప్ల...
విశాఖపట్నం: విశాఖ స్టీల్‌ప్లాంట్ కోసం ఉద్యమం ఉధృత రూపం దాల్చింది. ప్రైవేటీకరణపై నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. కూర్మన్నపాలెం స్టీల్ ప్లాంట్ ఎదుట కార్మికులు శుక్రవారం రిలే దీక్షలు చేపట్టారు. ఈ దీక్షలకు మంత్రి అవంతి శ్రీనివాస్, ఎమ్మెల్యే నాగిరెడ్డి సంఘీభావం తెలిపారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కార్మికుడు డిమాండ్ చేశారు. విశాఖ ఉక్కు- ఆంధ్రుల హక్కు అంటూ నినాదాలు చేశారు. స్టీల్‌ప్లాంట్‌పై జేఏసీ.. భవిష్యత్ కార్యాచరణ ప్రకటించింది. ఈనెల 18న స్టీల్ ప్లాంట్ ఆవిర్భావ దినోత్సవాన్ని బహిష్కరించిన జేఏసీ.. ఈ నెల18నే స్టీల్‌ప్లాంట్ పరిరక్షణ దినోత్సవంగా ప్రకటించింది. గాజువాకలో ఈనెల 18న కార్మికుల బహిరంగ సభ నిర్వహించడానికి విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ సన్నాహాలు చేస్తోంది.
స్టీల్‌ప్లాంట్‌ను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ అన్నారు. దక్షిణాది రాష్ట్రాలపై కేంద్రం చిన్నచూపు చూస్తోందన్నారు. అమరుల త్యాగాలు తెలియకుండా మాట్లాడటం బాధాకరమన్నారు. స్టీల్‌ప్లాంట్ విషయంలో కేంద్రం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని అవంతి శ్రీనివాస్ డిమాండ్ చేశారు.