ఆ మధ్య మెగా హీరో వరుణ్ తేజ్ కోసం ఓ అభిమాని తన స్వస్థలమైన బిక్కనూర్ నుంచి హైదరాబాద్‌కు నడుచుకుంటూ వచ్చిన విషయం తెలిసిందే. అతడి గురించి త...
ఆ మధ్య మెగా హీరో వరుణ్ తేజ్ కోసం ఓ అభిమాని తన స్వస్థలమైన బిక్కనూర్ నుంచి హైదరాబాద్‌కు నడుచుకుంటూ వచ్చిన విషయం తెలిసిందే. అతడి గురించి తెలుసుకున్న వరుణ్ తన బిజీ షెడ్యూల్‌కు కాసేపు విరామం చెప్పి అభిమానిని దగ్గరకు తీసుకున్నాడు. అతడితో కబుర్లు చెప్పి ఫొటోలు సైతం దిగాడు. ఈ ఘటన మరువకముందే తాజాగా మరో అభిమాని దగ్గుబాటి హీరో వెంకటేశ్‌ను కలిసేందుకు పాద యాత్ర చేస్తున్నాడు. వికారాబాద్ జిల్లా తాండూర్‌లోని బుద్ధారాం గ్రామానికి చెందిన శ్రీనివాస్ హీరో వెంకీకి వీరాభిమాని. ఆయనన్నా, ఆయన సినిమాలన్నా ఎంతో పిచ్చి. ఎలాగైనా ఆయనను కలవాలన్న తపనతో 140 కిలోమీటర్లు పాదయాత్ర చేసుకుంటూ రామానాయుడు స్టూడియోకు చేరుకున్నాడు. కానీ ఆయన నారప్ప కోసం వేరే లొకేషన్‌లో ఉండటంతో కలవలేకపోయాడు.
వెంకటేశ్ అభిమాని శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ.. "ఏడేళ్ల వయసులో జనం మనదేరా సినిమా చూశాను. అప్పటి నుంచి ఆయనకు వీరాభిమానిగా మారిపోయా. ఆ సినిమాను 30 సార్లు చూశాను. ప్రతి ఏడాది వెంకటేశ్ పుట్టిన రోజును కూడా గ్రాండ్‌గా చేస్తాను. ఇప్పటికే రెండు, మూడు సార్లు వచ్చాను, కానీ కలవలేకపోయాను. అందుకే ఈసారి పాదయాత్ర చేసుకుంటూ వచ్చాను. కానీ ఆయన నారప్ప షూటింగ్‌లో ఉండటంతో కలవలేకపోయాను. కాకపోతే ఆయన తిరిగొచ్చాక ఫోన్ చేసి చెప్తామని, అప్పుడు కలవొచ్చని చెప్పారు అని పేర్కొన్నాడు. వారి పిలుపు కోసం ఎదురు చూస్తూ ఉంటానంటున్నాడు శ్రీనివాస్.
కాగా ఈ దగ్గుబాటి హీరో ప్రస్తుతం ప్రియమణితో కలిసి నారప్పలో కనిపించనున్న విషయం తెలిసిందే. అసురన్‌కు రీమేక్‌గా తెరకెక్కుతున్న దీనికి శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహిస్తున్నాడు. ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా మే 14న విడుదల కానుంది. కార్తీక్ రత్నం, ప్రకాష్ రాజ్, మురళీ శర్మ, సంపత్ రాజ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.