వాషింగ్టన్: ఒక రోగి కోరిక తీర్చిన వైద్య సిబ్బందికి అభినందనలు వెల్లువెత్తాయి. అమెరికాలోని క్లీవ్‌ల్యాండ్‌లో ఈ ఘటన జరిగింది. ఒక మహిళ శనివార...
వాషింగ్టన్: ఒక రోగి కోరిక తీర్చిన వైద్య సిబ్బందికి అభినందనలు వెల్లువెత్తాయి. అమెరికాలోని క్లీవ్‌ల్యాండ్‌లో ఈ ఘటన జరిగింది. ఒక మహిళ శనివారం అనారోగ్యానికి గురయ్యారు. దీంతో క్వీన్స్‌ల్యాండ్ అంబులెన్స్ సర్వీస్‌కు చెందిన పారామెడికల్ సిబ్బంది ఆమెను అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించసాగారు. అయితే ఆ మహిళ ఒక కోరిక కోరారు. ఆసుపత్రిలో చేరే ముందు సాగర అందాలను ఒకసారి ఆస్వాదించాలని ఉందని చెప్పారు. రోగి కోరికను మన్నించిన అంబులెన్స్ సిబ్బంది ఆమెను వీల్ స్ట్రెచర్‌లో లైట్‌హౌస్ వద్ద ఉన్న బీచ్‌లోని వ్యూ పాయింట్‌కు తీసుకెళ్లారు. దీంతో ఆమె కొంతసేపు సముద్రపు అందాలను, అలల సవ్వడిని ఆస్వాదించారు. ఆ ఇద్దరు సిబ్బంది ఓపికగా ఆమె వెంటే ఉన్నారు.
కాగా, అక్కడ ఉన్న నీల్ కింగ్ అనే వ్యక్తి దీనిని తన మొబైల్‌లో చిత్రీకరించారు. మహిళా రోగి కోరిక తీర్చిన అంబులెన్స్ సిబ్బందిని ప్రశంసిస్తూ సామాజిక మాధ్యమంలో పోస్ట్ చేశారు. దీంతో ఈ ఫోటో వైరల్ అయ్యింది. రోగికి సముద్రపు అందాలు చూపించిన పారామెడికల్ సిబ్బంది చొరవను పలువురు నెటిజన్లు కొనియాడారు. క్వీన్స్‌ల్యాండ్ అంబులెన్స్ సర్వీస్ కూడా తమ సిబ్బంది చేసిన పనిని అభినందించింది. మా అద్భుతమైన సిబ్బంది చూపిన చొరవను కేవలం మాటల్లో కృతజ్ఞతలు చెప్పలేమని ఫేస్‌బుక్‌లో పేర్కొంది.
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.