దిల్లీ: భారత్‌లో త్వరలోనే మరో వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. తుదిదశ ప్రయోగాలను పూర్తి చేసుకుంటున్న 'స్పుత్ని...
దిల్లీ: భారత్‌లో త్వరలోనే మరో వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. తుదిదశ ప్రయోగాలను పూర్తి చేసుకుంటున్న 'స్పుత్నిక్-వి' అత్యవసర వినియోగ అనుమతికి సిద్ధమైంది. ఇందుకోసం భారత్‌లో ప్రయోగాలు నిర్వహిస్తున్న డాక్టర్ రెడ్డీస్ అనుమతి కోసం కేంద్ర నియంత్రణ సంస్థలను సంప్రదించినట్లు ప్రకటించింది.
రష్యన్ డైరెక్ట్ ఇన్వెస్టిమెంట్ ఫండ్(ఆర్‌డీఐఎఫ్) అభివృద్ధి చేసిన కొవిడ్ వ్యాక్సిన్ 'స్పుత్నిక్-వి' 91.6 శాతం సమర్థత కలిగినట్లు ఇప్పటికే వెల్లడైంది. వీటిని భారత్‌లో రెండు, మూడో దశ ప్రయోగాలను డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్ చేపట్టింది. తుది దశ ప్రయోగాలు ఫిబ్రవరి 21నాటికి ముగుస్తాయని ఆ కంపెనీ అంచనా వేస్తోంది. వీటికి సంబంధించిన మధ్యంతర ఫలితాలను త్వరలోనే నియంత్రణ సంస్థలకు ఇవ్వనున్నట్లు తెలిపింది.
గమలేయా ఇన్‌స్టిట్యూట్ సహకారంతో ఆర్‌డీఐఎఫ్ అభివృద్ధి చేసిన స్పుత్నిక్-వి వ్యాక్సిన్‌కు ఇప్పటికే దాదాపు 30దేశాలు ఆమోదం తెలిపాయి. ప్రస్తుతం భారత్‌లో అందుబాటులోకి వచ్చిన రెండు వ్యాక్సిన్‌ల కంటే ఈ టీకా సమర్థత ఎక్కువగా ఉంది. మరోవైపు మరికొన్ని రోజుల్లోనే భారత్‌లో మరో రెండు కరోనా వ్యాక్సిన్‌లు అందుబాటులోకి వస్తాయని కేంద్ర ప్రభుత్వం పలు సందర్భాల్లో వెల్లడించింది.