Page Nav

HIDE

Grid

GRID_STYLE

Pages

latest

పాకిస్తాన్‌లో కొత్తగా విధుల్లోకి 'రోలర్‌బ్లేడింగ్‌' యూనిట్లు - Vandebharath

  ఇస్లామాబాద్ : పాకిస్తాన్‌లోని అతిపెద్ద నగరమైన కరాచీలో శాంతిభద్రతల పరిరక్షణ అక్కడి పోలీసులకు కత్తిమీది సాములా తయారైంది. పెరిగిపోతున్న వివిధ...

 


ఇస్లామాబాద్ : పాకిస్తాన్‌లోని అతిపెద్ద నగరమైన కరాచీలో శాంతిభద్రతల పరిరక్షణ అక్కడి పోలీసులకు కత్తిమీది సాములా తయారైంది. పెరిగిపోతున్న వివిధ ముఠాలను అదుపుచేయడం సాధారణ పోలీసులు ఇబ్బందికరంగా తయారైంది. దాంతో 'రోలర్‌బ్లేడింగ్‌' యూనిట్లను రంగంలోకి దింపేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఒక్కో యూనిట్‌లో 20 మందిని ఎంపిక చేసిన అధికారులు వారికి కఠిన శిక్షణ అందిస్తున్నారు. ఎలాంటి గల్లీలోనికైనా ఈజీగా దూసుకుపోయేలా వారికి స్కేటింగ్‌లో తర్ఫీదునిస్తున్నారు. రోలర్‌ స్కేటింగ్‌ షూ వేసుకుని రంగంలోకి దిగే ఈ రోలర్‌బ్లేడర్స్‌ ఎలాంటి విపత్తునైనా ఆవలీలగా ఎదుర్కొనేందుకు శిక్షణ ఇస్తున్నారు. నలుపు రంగు ప్రత్యేక దుస్తులు ధరించి విధుల్లో ఉండే రోలర్‌బ్లేడింగ్‌ యూనిట్లు సదా రివాల్వర్‌తో సిద్ధంగా ఉంటాయి.

"వీధి నేరాలను నియంత్రించడానికి వినూత్న విధానాన్ని తీసుకురావాల్సిన అవసరం ఉందని భావించాం" అని యూనిట్ చీఫ్ ఫరూఖ్ అలీ చెప్పారు. రోలర్‌బ్లేడ్లపై ఉండే సిబ్బంది 20 మిలియన్ల జనాభా ఉన్న నగరంలో బైకులపై దొంగలను మరింత సులభంగా వెంబడించగలరని తెలిపారు. రహదారుల పరిస్థితులు, అడ్డదిడ్డంగా ఉండే ఫుట్‌పాత్‌ల కారణంగా కరాచీలోని అనేక ప్రాంతాలలో రోలర్‌బ్లేడింగ్ పోలీసులను మోహరించలేమని పోలీసులే అంగీకరిస్తున్నారు. అయితే, దొంగతనం, వేధింపులు ఎక్కువగా ఉండే ప్రాంతాలకు పంపి సమస్య పరిష్కరించేలా చూసేందుకు కసరత్తు ప్రారంభించారు. రోలర్‌బ్లేడింగ్‌తో ఇరుకైన ప్రాంతాలను చాలా త్వరగా చేరుకొనే వీలుంటుందని పోలీసులు భావిస్తున్నారు. వచ్చే నెలలో అందుబాటులోకి వచ్చేలా చర్యలు తీసుకుంటున్నట్లు పోలీసు అధికారి ఒకరు చెప్పారు. ఈ మాదిరి రోలర్‌బ్లేండింగ్‌ యూనిట్లు ప్రస్తుతం యూరప్‌ దేశాల్లో అందుబాటులో ఉన్నాయి.