మాస్కో : అనుమానం పెనుభూతమైంది. ఫోన్ లాక్ చెప్పాలని మాజీ భార్యతో గొడవ పడ్డ ఓ వ్యక్తి.. అందుకు ఆమె తిరస్కరించినందుకు 15 సార్లు కత్తితో పొడిచ...
మాస్కో : అనుమానం పెనుభూతమైంది. ఫోన్ లాక్ చెప్పాలని మాజీ భార్యతో గొడవ పడ్డ ఓ వ్యక్తి.. అందుకు ఆమె తిరస్కరించినందుకు 15 సార్లు కత్తితో పొడిచి చంపాడు. ఈ దారుణ ఘటన రష్యాలోని వాల్దికవ్‌కాజ్‌లో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే.. వదీం తెక్‌హోవ్(32), రెజీనా గగైవాకు కొన్నేండ్ల క్రితం వివాహమైంది. పెళ్లి సమయంలో రెజీనా వయసు 18 ఏండ్లు మాత్రమే. పెళ్లి అయిన రెండేండ్ల తర్వాత రెజీనా మగశిశువుకు జన్మినిచ్చింది. అనంతరం వదీం ఆమెకు విడాకులిచ్చాడు. దీంతో రెజీనా తల్లిగారింటికి వెళ్లిపోయింది.
అనుమానంతో హత్య
అయితే విడాకులు తీసుకున్న తర్వాత కూడా రెజీనాను వదీం అనుమానించడం మొదలుపెట్టాడు. ఆమె వేరొకరితో వివాహేతర సంబంధం పెట్టుకున్నట్లు వదీం భావించి, వేధించాడు. ఇటీవలే ఆమె కార్యాలయానికి వెళ్లిన అతను.. ఫోన్ లాక్కొని లాక్ తీయమని డిమాండ్ చేశాడు. కానీ రెజీనా ఫోన్ లాక్ తీసేందుకు నిరాకరించింది. దీంతో తీవ్ర ఆగ్రహంతో ఊగిపోయిన వదీం.. ఆమెను కత్తితో విచక్షణారహితంగా పొడిచి చంపాడు. 15 కత్తిపోట్లకు గురైంది రెజీనా.
16 ఏండ్ల జైలు శిక్ష
మాజీ భార్యను చంపిన కేసులో వదీంకు కోర్టు 16 ఏండ్ల జైలు శిక్ష విధించింది. రెజీనాతో విడాకులు తీసుకున్న తర్వాత మనస్తాపానికి గురైన వదీం.. ఇద్దరిపై దాడి చేసి చంపాడు. అతని వేధింపులు భరించలేని రెజీనా పలుసార్లు పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ లాభం లేకుండా పోయింది. చివరకు వదీం చేతిలో రెజీనా ప్రాణాలు కోల్పోయింది అని ఆమె తల్లి బోరున విలపించింది.