తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి భారతీయ జనతా పార్టీ అధికార టీఆర్ఎస్ పార్టీని ఢీకొట్టడంతో పాటు మరో ముఖ్యమైన పని కూడా చేస్తోంది. అదే...
తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి భారతీయ జనతా పార్టీ అధికార టీఆర్ఎస్ పార్టీని ఢీకొట్టడంతో పాటు మరో ముఖ్యమైన పని కూడా చేస్తోంది. అదేంటంటే.. హైదరాబాద్ నాంపల్లిలో ఉన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో వాస్తు మార్పులు. ఔను. బీజేపీ ఆఫీసులో వాస్తు మార్పులు చేయిస్తోంది. తెలంగాణ రాష్ట్ర పార్టీ ఆఫీసులో వాస్తు దోషం ఉందని చాలా మంది నేతలు భావిస్తున్నారట. దీంతో ప్రస్తుత అధ్యక్షుడు బండి సంజయ్ కూడా రాష్ట్రంలో పార్టీ పెద్ద నేతలతో మాట్లాడి పార్టీ ఆఫీసులో వాస్తు మార్పులు చేయించాలని నిర్ణయించారు. దీనికి తగినట్టు మార్పులు చేస్తున్నారు. పార్టీ ఆఫీసు ముఖద్వారాన్ని మారుస్తున్నారు. 2018 డిసెంబర్ ఎన్నికల్లో 118 చోట్ల పోటీ చేసిన బీజేపీ కేవలం ఒక్క చోట మాత్రమే గెలిచింది. దీంతో పార్టీ ఆఫీసులో వాస్తు దోషం వల్ల ఇలా జరుగుతోందని భావించిన నేతలు, ఆ తర్వాత ఆఫీసులో ఏర్పాటు చేసిన టాయిలెట్‌ను తీసేసి అక్కడ చిన్న చిన్న మార్పులు చేశారు. ఆ తర్వాత 2019లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ తరఫున నలుగురు ఎంపీలు గెలిచారు. దీంతో వాస్తు దోషం ఉందనే బలమైన అభిప్రాయానికి వచ్చారు కమలనాధులు.
తాజాగా, దుబ్బాక ఎన్నికల్లో గెలుపు, ఆ తర్వాత జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా హవా చూపించారు. ఈ హవా ఇలాగే కంటిన్యూ అవ్వాలంటే, 2023 లో తెలంగాణలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి రావాలంటే మరిన్ని వాస్తు మార్పులు అవసరం అని భావించిన పార్టీ నేతలు ఆ మేరకు తగిన మార్పులు చేయిస్తున్నారు.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వాస్తుకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. ఆఫీసు ఎంట్రన్స్‌లో మెయిన్ డోర్‌ను పర్మినెంట్‌గా మూసేశారు. పార్టీ ఆఫీసుకు వచ్చే నేతలు అందరూ భవనానికి ఉత్తరం పక్కన ఉన్న చిన్న డోర్ నుంచి వస్తున్నారు. ఆ మార్పు చేసిన తర్వాత గతంలో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా చేసిన లక్ష్మణ్.. బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు అయ్యారు. బండి సంజయ్ కూడా తాను కూర్చునే డైరెక్షన్ మార్చేశారు. లక్ష్మణ్ కూర్చునేదానికి పూర్తి వ్యతిరేకంగా కూర్చుంటున్నారు. ఆఫీసులో సెల్లార్ ఎంట్రన్స్ దగ్గర మొత్తం మూసేస్తూ గోడ కట్టేశారు. ఈశాన్యం వైపు ఉన్న గోడను కూడా కొంచెం మార్పులు చేశారు. బీజేపీ ఆఫీసు మెయిన్ డోర్ దాదాపు మూసేశారు. చాలా పెద్ద పెద్ద సమావేశాలు జరిగి, చాలా మంది నేతలు, కార్యకర్తలు వచ్చేటప్పుడు మాత్రమే దీన్ని తెరుస్తున్నారు.
ఇక వాస్తు మీద తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత, సీఎం కేసీఆర్‌కు కూడా విపరీతమైన నమ్మకం ఉందంటారు. ఆయన కూడా పార్టీ ఆఫీసులో కూడా మార్పులు చేయించారు. వాస్తు కుదరకపోవడం వల్ల ముఖ్యమంత్రి ఏకంగా సచివాలయాన్ని కూల్చేసి కొత్త సచివాలయాన్ని కట్టిస్తున్నారని కూడా విపక్షాలు ఆరోపిస్తున్నాయి.