చమోలీ : ఉత్తరాఖండ్ చమోలీ జిల్లాలోని అలకనందా నది మరోసారి ఉప్పొంగింది. ఈ హఠాత్పరిణామంతో అధికారులు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. దీంతో తపో...
చమోలీ : ఉత్తరాఖండ్ చమోలీ జిల్లాలోని అలకనందా నది మరోసారి ఉప్పొంగింది. ఈ హఠాత్పరిణామంతో అధికారులు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. దీంతో తపోవన్ వపర్ ప్రాజెక్టు టన్నెల్ వద్ద కొనసాగుతున్న సహాయక చర్యలను తాత్కాలికంగా నిలిపివేశారు. ఇటీవల ఉత్తరాఘండ్‌లో భారీ మంచు కొండ విరిగి అలకనందా, రైనీ నదికి వరద పోటెత్తిన విషయం తెలిసిందే. ఆ వరద ధాటికి రైనీ నది ఆనకట్ట కొట్టుకుపోయి తపోవన్ వపర్ ప్రాజెక్ట్ దెబ్బతింది. దీంతో అందులో పని చేస్తున్న కార్మికులు సుమారు 200 మందికి పైగా గల్లంతయ్యారు. ఇప్పటి వరకు 34 మృతదేహాలను గుర్తించారు. 29 మందిని ఎన్‌డిఆర్‌ఎఫ్, ఎస్‌డిఆర్‌ఎఫ్ సిబ్బంది కాపాడగలిగింది. మిగిలిన వారి కోసం సహాయక చర్యలు కొనసాగుతుండగా.. నేడు మరోసారి అలకనంద నది ఉప్పొంగింది. దీంతో అక్కడ కొనసాగుతున్న సహాయక చర్యలను అధికారులు తాత్కాలికంగా నిలుపుదల చేశారు. మరోవైపు ఉత్తరాఖండ్ వరద బీభత్సం తర్వాత కొనసాగుతున్న సహాయక చర్యలకు ఆటంకాలు ఎక్కువ అవుతూనే ఉన్నాయి. వరదలో గల్లంతై తపోవన్ సొరంగంలో చిక్కుకున్నట్లు భావిస్తున్న వారిని రక్షించేందుకు చేపట్టిన డ్రిల్లింగ్ ఆపరేషన్ అకస్మాత్తుగా నిలిచిపోయింది.
తవ్వకాలు జరిపే మెషీన్ చెడిపోవడం వల్ల తాత్కాలికంగా నిలిపివేసినట్లు రాష్ట్ర డిజిపి అశోక్ కుమార్ వెల్లడించారు. కాగా, సహాయక చర్యల్లో నిర్లక్ష్యం వహిస్తున్నారని తప్పిపోయిన కార్మికుల కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. తమ ఆత్మీయుల కోసం పడిగాపులు గాస్తున్నారు.