ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ నుంచి జరిగిన పీఎస్‌ఎల్‌వీ సీ51 ప్రయోగం విజయవంతం అయ్యింది. షార్ మొ...
ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ నుంచి జరిగిన పీఎస్‌ఎల్‌వీ సీ51 ప్రయోగం విజయవంతం అయ్యింది.
షార్ మొదటి లాంచ్ పాడ్ నుంచి దీనిని ఆదివారం(ఫిబ్రవరి 28) ఉదయం 10.24కు విజయవంతంగా ప్రయోగించారు.
ఈ రాకెట్ ద్వారా బ్రెజిల్‌కు చెందిన అమెజానియా 1 ఉపగ్రహంతో పాటు ప్రభుత్వ, ప్రైవేటు రంగాలకు చెందిన 19 ఉపగ్రహాలను విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టారు.
ఇది ఈ ఏడాది ఇస్రో నుంచి జరిగిన తొలి అంతరిక్ష ప్రయోగం. పీఎస్ఎల్‌వీ డీఎల్ వెర్షన్‌లో మూడోది. భారత్ ఇప్పటివరకూ దీనిని రెండు సార్లు మాత్రమే ప్రయోగించింది.
ఇస్రో వెబ్ సైట్‌లోని వివరాల ప్రకారం లాంచ్ జరిగిన ఒక గంట 51 నిమిషాల 32 సెకండ్ల నుంచి గంటా 55 నిమిషాల 7 సెకండ్ల లోపు పీఎస్ఎల్‌వీ-సీ51 రాకెట్ అన్ని ఉపగ్రహాలను కక్ష్యలోకి ప్రవేశపెడుతుంది.
ఇది భారత్ ప్రయోగించిన 53వ పీఎస్ఎల్‌వీ ప్రాజెక్ట్. భారత ప్రభుత్వ సంస్థ న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ తొలి ప్రయోగం. న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్(ఎన్ఎస్ఈఎల్), అమెరికా స్పేస్ ఫ్లైట్‌తో కలిసి దీనిని స్పాన్సర్ చేసింది.
ఇస్రో వెబ్ సైట్ వివరాల ప్రకారం 637 కిలోల అమెజానియా అనే భూమని పరిశీలించే ఉపగ్రహాన్ని ఆ దేశ అంతరిక్ష సంస్థ తయారు చేసింది. ఇది బ్రెజిల్‌లో అడవుల కొట్టివేతను పర్యవేక్షిస్తుంది. ఈ ఉపగ్రహం నాలుగేళ్ల పాటు పనిచేయనుంది.
మిగతా ఉపగ్రహాల్లో మూడు భారత్‌లోని విద్యా సంస్థలకు చెందినవి. వీటిలో ఒక శాటిలైట్‌ను చెన్నైలోని స్పేస్ కిడ్స్ ఇండియా పంపించింది. మిగతా 14 ఉపగ్రహాలను ఎన్ఎస్ఐఎల్ తరఫున అంతరిక్షంలోకి ప్రయోగించినట్లు ఏఎన్ఐ చెప్పింది.
తమ ఉపగ్రహం ద్వారా 25 వేల మంది భారతీయుల పేర్లతో పాటూ ప్రధాని నరేంద్ర మోదీ పొటోను కూడా అంతరిక్షంలోకి పంపామని, వాటితోపాటూ భగవద్గీతను కూడా పంపించామని దానిని రూపొందించిన చెన్నైకి చెందిన స్పేస్ కిడ్స్ విద్యా సంస్థ ఒక ప్రకటన విడుదల చేసింది.