కరోనా మహమ్మారిని ఎదుర్కోవడంలో ఆర్థికపరమైన సపోర్టు కోసం కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన పీఏం కేర్స్ ఫండ్‌కు ప్రభుత్వరంగ సంస్థల...
కరోనా మహమ్మారిని ఎదుర్కోవడంలో
ఆర్థికపరమైన సపోర్టు కోసం కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన పీఏం కేర్స్
ఫండ్‌కు ప్రభుత్వరంగ సంస్థలతోపాటు, ప్రభుత్వరంగంలోని పలు
జాతీయస్థాయి విద్యాసంస్థలు కూడా భారీగా విరాళాలు అందజేశాయి. నవోదయ
పాఠశాలలు, ఐఐటీలు, ఎంఐటీలు, సెంట్రల్ యూనివర్సిటీలు కలిసి పీఎం కేర్స్
ఫండ్కు 21.81 కోట్ల విరాళాలు అందించాయని ఆర్టీఐ రికార్డులు
స్పష్టంచేస్తున్నాయి.
ఆర్టీఐ నుంచి సమాచారం రాబట్టిన ఓ
జాతీయస్థాయి మీడియా సంస్థ ఈ వివరాలను వెల్లడించింది. పీఎం కేర్స్
ఫండ్‌ను ఏర్పాటు చేసిన నాలుగు రోజుల్లోనే రూ.3,076.62 కోట్ల విరాళాలు
సమకూరాయని, అందులో రూ.3,075.85 కోట్లు స్వచ్ఛంద విరాళాలేనని ఆ మీడియా
సంస్థ తన అధికార వెబ్‌సైట్‌లో వెల్లడించింది.
వచ్చిన మొత్తం విరాళాల్లో 70 శాతం
అంటే రూ.2,105 కోట్ల నిధులు 38 ప్రభుత్వరంగ సంస్థల నుంచే వచ్చాయని
తెలిపింది. అందులో అధ్యాపకులు, ఉద్యోగుల వేతనాలు, పెన్షన్లే ఎక్కువగా
ఉన్నాయని పేర్కొన్నది. మొత్తం 82 విద్యాసంస్థలు పీఎం కేర్స్‌కు విరాళాలు
అందజేశాయని తెలిపింది.
జాతీయస్థాయి విద్యాసంస్థల నుంచి
వచ్చిన నిధుల్లో.. దేశవ్యాప్తంగా ఉన్న 600 నవోదయ పాఠశాలల నుంచి
రూ.7.48 కోట్లు వచ్చాయి. ఆ తర్వాత 11 సెంట్రల్ యూనివర్సిటీలు రూ.3.39
కోట్లు అందజేశాయి. అందులో అలీఘర్ ముస్లిం యూనివర్సిటీ అత్యధికంగా
రూ.1.33 కోట్లు ఇచ్చింది.
ఇక దేశంలోని 20 ఐఐటీలు రూ.5.47
కోట్లు అందజేశాయి. అందులో ఐఐటీ ఖరగ్‌పూర్ అత్యధికంగా కోటి రూపాయలు
విరాళంగా ఇచ్చింది. దేశంలోని 10 ఐఐఎంలు కలిసి రూ.66 లక్షలు పీఎం
కేర్స్‌కు విరాళంగా అందజేశాయి. అందులో కోజికోడ్ ఐఐఎం అత్యధికంగా 33.53
లక్షలు ఇచ్చింది.
ఇక 9 ఎన్ఐటీల నుంచి రూ.1.01 కోట్లు
పీఎం కేర్స్‌కు విరాళంగా సమకూరాయి. మరోవైపు దేశంలోని పేరొందిన సైన్స్
విద్యాసంస్థలైన ఐఐఎస్‌సీ-బెంగళూరు రూ.25.64 లక్షలు, 7 ఐఐఎస్సీఆర్‌లు
రూ.45.79 లక్షలు విరాళంగా సమకూర్చాయి. ఇక ఇతర కీలక సంస్థలైన
ఎన్‌సీఈఆర్‌టీ రూ.35.22 లక్షలు, ఏఐసీటీఈ రూ.13.80 లక్షలు, యూజీసీ
రూ.7.41 లక్షలు విరాళంగా అందజేశాయి.