Page Nav

HIDE

Grid

GRID_STYLE

Pages

latest

పాక్ లో మరో సిక్కు యువతి కిడ్నాప్, వివాహం - vandebharath

  పాకిస్తాన్‌లో మరో సిక్కు బాలికను అపహరించారు. బాలికకు మత మార్పిడి చేయించి బలవంతంగా వివాహం చేసుకున్న ఘటన ఇస్లామాబాద్ కు సమీపంలోని హసన్ అబ్...

 


పాకిస్తాన్‌లో మరో సిక్కు బాలికను అపహరించారు. బాలికకు మత మార్పిడి చేయించి బలవంతంగా వివాహం చేసుకున్న ఘటన ఇస్లామాబాద్ కు సమీపంలోని హసన్ అబ్దుల్ ప్రాంతంలో జరిగింది. 
 
గత ఏడాది నంకనాలోని గురుద్వర తంబూ సాహిబ్ ముఖ్య గ్రంథి కుమార్తెను అపహరించిన దుండగులు బలవంతంగా మతం మార్చి వివాహం జరిపించారు. ఈ సంఘటన తరువాత నంకనా సాహిబ్‌లో చాలా రోజులు ఉద్రిక్తత నెలకొన్నది. 
 
రెండో ఘటనతో పాకిస్తాన్‌లో మైనారిటీలు ప్రమాదంలో పడిపోయారన్నది స్పష్టం చేస్తున్నది. పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్ కు కేవలం 40 కిలో మీటర్ల దూరంలో హసన్ అబ్దుల్ ప్రాంతానికి చెందిన 22 ఏండ్ల యువతి పనికోసం బయల్దేరింది. అనంతరం ఆమె కనిపించకుండాపోయింది. 
 
కుటుంబసభ్యులు ఎంతగా వెతికినా ప్రయోజనం లేకపోవడంతో హసన్ అబ్దుల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. తమ కుమార్తెను గుర్తుతెలియని వ్యక్తులు కిడ్నాప్ చేసినట్లు యువతి తండ్రి లిఖితపూర్వక ఫిర్యాదు అందించాడు. 
 
అయితే మరుసటిరోజు ఆమె తల్లిదండ్రులకు వాట్సాప్ మెసేజ్ వచ్చింది. అందులో తాను తన ఇష్టానుసారంగా ఇస్లాం మతాన్ని స్వీకరించానని చెప్పినట్లుగా ఉన్నది. సిక్కు గురుద్వారా పర్బంధక్ కమిటీ అమీర్ సింగ్ ఈ సంఘటనను ధృవీకరించారు. మతం మారిన తర్వాత స్థానిక యువకుడిని వివాహం చేస్తున్నట్లు స్థానిక దినపత్రిక ది డాన్ కథనం ప్రచురించింది.
 
పాకిస్తాన్లోని ముస్లిమేతర అమ్మాయిలను బలవంతంగా ఇస్లాం మతం స్వీకరించేలా ఒత్తిడి చేస్తున్నారు. కిడ్నాప్ చేసి హింసించి మరీ మతం మార్పిడి చేస్తున్నట్లుగా తెలుస్తున్నది. మతం మార్చుకున్నట్లు చెప్పగానే బలవంతంగా ముస్లిం యువకుడితో వివాహం జరిపిస్తున్నారు. 
 
అంతర్జాతీయ మత స్వేచ్ఛపై యునైటెడ్ స్టేట్స్ కమిషన్ గణాంకాల ప్రకారం పాకిస్తాన్‌లో ప్రతి సంవత్సరం వేయికి పైగా (12 నుంచి 28 సంవత్సరాల మధ్య) బాలికలు మతం మారుతున్నారు. బాలికలను అపహరించి లైంగికదాడి చేసి బలవంతంగా వివాహం చేసుకుంటారని, వీరిలో ఎక్కువగా హిందూ, క్రైస్తవ బాలికలే ఉంటారని ఆ గణాంకాలు వెల్లడిస్తున్నాయి.