Page Nav

HIDE

Grid

GRID_STYLE

Pages

latest

జనవరి లో మోడీ ఆంద్రప్రదేశ్ పర్యటన కీలకం.. కన్నా

రాష్ట్రంలో జనవరి ఆరున నిర్వహించే పార్టీ బహిరంగ సభ కీలక మలుపు కావాలని, తద్వారా ఆంధ్ర ప్రదేశ్  పార్టీ సత్తా ఏంటో చాటాలని బిజెపి  రాష్ట్ర క...



రాష్ట్రంలో జనవరి ఆరున నిర్వహించే పార్టీ బహిరంగ సభ కీలక మలుపు కావాలని, తద్వారా ఆంధ్ర ప్రదేశ్  పార్టీ సత్తా ఏంటో చాటాలని బిజెపి  రాష్ట్ర కార్యవర్గం నిర్ణయించింది. 2019 సార్వత్రిక ఎన్నికలకు ముందుగా నిర్వహించే ఈ సభకు ప్రధాని నరేంద్ర మోదీ హాజరవుతారని, ఈ నేపథ్యంలో భారీగా సభ నిర్వహణకు కృషిచేయాలని పిలుపునిచ్చారు. 


సోమవారం ఆ పార్టీ రాష్ట్ర కార్యవర్గం అత్యవసరంగా సమావేశమైంది. జనవరిలో మోదీ రాష్ట్ర పర్యటన, ఇంటింటికి బిజెపి  కార్యక్రమం, త్వరలో నిర్వహించే బస్సు యాత్ర, రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించింది. కార్యక్రమానికి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, కేంద్ర మాజీ మంత్రులు పురందేశ్వరి, కావూరి సాంబశివరావు, పార్టీ రాష్ట్ర సహ ఇన్‌ఛార్జి సునీల్‌ దియోధర్‌, ఎమ్మెల్సీ సోము వీర్రాజు తదితరులు హాజరయ్యారు. 

నిధులు పొందుతూ మోదీ ప్రభుత్వాన్ని విమర్శించటమే ధ్యేయంగా రాష్ట్రంలో పాలన సాగుతోందని కన్నా లక్ష్మీనారాయణ ఆరోపించారు. దీన్ని ఎండగట్టడానికి ఇంటింటికీ బిజెపి  కార్యక్రమాన్ని ఈనెల 16 వరకు కొనసాగించాలని సూచించారు. మోదీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలపై విస్తృత ప్రచారానికి జనవరి 2 నుంచి చేపట్టే బస్సు యాత్రను విజయవంతం చేయాలని కోరారు.

కాగా, పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసుకునే ప్రక్రియలో భాగంగా అసెంబ్లీ కన్వీనర్లు, పార్లమెంట్‌ కన్వీనర్లు, ఇన్‌ఛార్జులు  తదితరులను నియమించుకున్నామని కన్నా పేర్కొన్నారు. వీరంతా 2019 ఎన్నికలకు పార్టీని పటిష్ఠపరిచే బృంద సభ్యులేనని, పోటీ చేసే అభ్యర్థులు మాత్రం కారని ఆయన స్పష్టీకరించారు. 

బీజేపీ మద్దతుతోనే ముఖ్యమంత్రి చంద్రబాబు రాజకీయంగా ఎదిగారని పార్టీ నాయకుడు సోము వీర్రాజు పేర్కొన్నారు. సమావేశం అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ  1995లో చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యేందుకు, 2004లో ముందస్తు ఎన్నికలకు వెళ్లటానికి ఆయనకు తోడ్పడింది పార్టీ నేత వాజపేయీ అని గుర్తుచేశారు. తాను ఎదిగేందుకు ఎంతో అండగా ఉన్న బీజేపేని ను అణగదొక్కటానికి చంద్రబాబు ప్రయత్నాలు ప్రారంభించారని ధ్వజమెత్తారు. అయితే అవి సఫలం కావని స్పష్టం చేశారు.  రాష్ట్రంలో మోదీ సభ ఎక్కడ నిర్వహించాలనే దానిపై త్వరలోనే స్పష్టతను ఇస్తామని చెప్పారు.

రాష్ట్రంలో విఫలమైన మాదిరే దేశంలో కూడా బాబు విఫలం అవుతారని తెలిపారు.  టీడీపీ కనుమరుగు అవుతుందనే భయంతోనే ప్రజల సొమ్ముతో ధర్మ పోరాట దీక్షలు చేస్తున్నారని విమర్శించారు. చంద్రబాబు ఊహించిన దానికి విరుద్ధంగా ఏపీలో రాజకీయాలు జరగబోతున్నాయని తెలిపారు.

వ్యక్తిగత స్వలాభం కోసమే చంద్రబాబు రాజకీయాలు నడుపుతారని దుయ్యబట్టారు. బాబు వచ్చాక రాజకీయ వ్యవస్థ నాశనం అయిందని మండిపడ్డారు. బాబు నీచరాజకీయాలను బీజేపీనే అంతం చేస్తుందని అన్నారు. ఏపీలో వేల కోట్లు అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. ప్రధాని నరేంద్ర మోదీ లేకపోతే చంద్రబాబు జీరో అన్నారు. 

ఏపీలో జరిగే ప్రతి పథకం నిధులూ కేంద్రానివేనని పేర్కొన్నారు. కేంద్రం ఇచ్చిన నిధులను చంద్రబాబు పప్పుబెల్లాల్లాగా వాడుకుంటున్నారని ఎద్దేవా చేశారు. రేపటి ఫలితాలలో మూడు రాష్ట్రాలలో బీజేపి  విజయం సాధించబోతుందని జోష్యం చెప్పారు.