Page Nav

HIDE

Grid

GRID_STYLE

Pages

latest

విజయ్ మాల్య భారత్ కు అప్పగింత

భారతదేశంలో వివిధ బ్యాంకుల వద్ద తీసుకున్న రూ. 9 వేల కోట్లకు పైగా రుణాన్ని ఎగవేసి లండన్‌కు పారిపోయిన విజయ్ మాల్యాను భారత్‌కు అప్పగించడానికి లం...

భారతదేశంలో వివిధ బ్యాంకుల వద్ద తీసుకున్న రూ. 9 వేల కోట్లకు పైగా రుణాన్ని ఎగవేసి లండన్‌కు పారిపోయిన విజయ్ మాల్యాను భారత్‌కు అప్పగించడానికి లండన్‌లోని వెస్ట్‌ మినిస్టర్ కోర్టు న్యాయమూర్తి అనుమతిచ్చారు.

మాల్యాను భారత్‌కు తరలించడానికి తాను అనుమతిస్తున్నట్లు, ఈ అప్పగింతకు సంబంధించిన ఉత్తర్వులపై సంతకం కోసం విదేశాంగ శాఖ మంత్రికి ఆ ఉత్తర్వులను పంపనున్నట్లు న్యాయమూర్తి తెలిపారు.

మాల్యా కొద్దిసేపటి క్రితం లండన్‌లోని వెస్ట్ మినిస్టర్ కోర్టుకు హాజరయ్యారు.అంతకుముందు కోర్టు బయట మాల్యా మాట్లాడుతూ, కోర్టు ఎలాంటి తీర్పు వెలువరించినా తమ లీగల్ టీం దాన్ని విశ్లేషించి అవసరమైన ముందడుగు వేస్తుందని ఆయన అన్నారు.ఈ తీర్పు నేపథ్యంలో భారత్ నుంచి సీబీఐ జాయింట్ డైరెక్టర్ ఎ సాయి మనోహర్ నేతృత్వంలోని సీబీఐ, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ సంయుక్త బృందం ఇప్పటికే లండన్‌ చేరుకుంది.

తనపై ఉన్న పరారీ ముద్రను తొలగించుకునేందుకు విజయ్ మాల్యా నానా తంటాలు పడుతున్నారు. బ్యాంకుల అప్పు తీరుస్తానన్న తన ఆఫర్లకు భారత అధికార వర్గాలను ఒప్పించడానికి విశ్వప్రయత్నాలు చేసిన మాల్యా.. సుప్రీంకోర్టును సైతం ఆశ్రయించి తన పేరుకు ముందు పరారీ ముద్రను తీసేయాలని, విచారణపై స్టే విధించాలని విజ్ఞప్తి చేశారు.

దర్యాప్తు సంస్థల చార్జ్‌షీట్‌ల ఆధారంగా ఈడీ ఆయనను పరారీలో ఉన్న ఎగవేతదారుగా నిర్ధారించింది. శుక్రవారం ఈ కేసు విచారించిన సుప్రీం.. స్టే ఇచ్చేందుకు నిరాకరించింది. అయితే ఆయన పిటిషన్‌పై ఈడీకి నోటీసులు జారీ చేసింది.

తనను భారత్‌కు అప్పగిస్తే.. భారతదేశంలోని జైళ్లలో సరైన వసతులు ఉండవంటూ కూడా మాల్యా గతంలో కోర్టులో వాదించారు. దీంతో ఒకవేళ ఆయనను భారత్‌కు అప్పగిస్తే, విచారణ సమయంలో ఆయన్ను ఏ జైల్లో పెడతారో, అక్కడ ఎలాంటి వసతులు ఉన్నాయో తెలిపేలా ఒక వీడియోను తీసి పంపాలని ఇటీవల కేసు విచారణ సందర్భంగా అక్కడి చీఫ్ మెజిస్ట్రేట్ ఆదేశించారు.

తాను భారత్ విడిచి వెళ్లేముందు 2016లో కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీని కలిశానని కూడా గతంలో మాల్యా వెల్లడించారు.

సెప్టెంబర్ 12న వెస్ట్ మినిస్టర్ కోర్టుకు హాజరైన మాల్యా, కోర్టు బయట మీడియాతో, "జెనీవాలో ఓ సమావేశానికి హాజరయ్యేందుకు వెళ్లే ముందు ఆర్థిక మంత్రిని కలిశాను. ఆ సందర్భంగా బ్యాంకులతో సెటిల్‌మెంట్‌కు సంబంధించి కూడా నేను ప్రస్తావించాను,'' అన్నారు.

ఆర్థిక మంత్రిని ఎందుకు కలిశారని ప్రశ్నించగా, అందుకు మాల్యా ''ఇలాంటివి అడిగి నన్ను ఇబ్బందిపెట్టకండి" అన్నారు.

తనతో ఆర్థికమంత్రి ఏమన్నారో మాల్యా వెల్లడించలేదు. అయితే మాల్యా వ్యాఖ్యలను అరుణ్ జైట్లీ ఖండించారు. 2014 నుంచి విజయ్ మాల్యాకు తాను ఎన్నడూ అపాయింట్‌మెంట్ కూడా ఇవ్వలేదని అన్నారు.

"ఆయన రాజ్యసభ సభ్యుడిగా ఉన్నప్పుడు అప్పుడప్పుడు సభకు వచ్చేవారు. ఓరోజు నేను నా గదికి వెళ్లేందుకు సభ నుంచి బయటకు నడుచుకుంటూ వెళ్తుండగా ఆయన నావెంట పడుతూ సెటిల్‌మెంట్ గురించి చెప్పారు. అప్పుడు అతను చెప్పేది వినకుండా, 'నాతో మాట్లాడటం కాదు, బ్యాంకులతో సెటిల్‌మెంట్ చేసుకోవాలి' అని చెప్పాను. ఆయన ఇవ్వబోయిన పేపర్‌ను కూడా నేను తీసుకోలేదు" అని అరుణ్ జైట్లీ వివరించారు.

బ్యాంకులకు వేల కోట్ల రుణ బకాయిల ఆరోపణలు ఎదుర్కొంటున్న మాల్యా 2016, మార్చి 2 నుంచి బ్రిటన్‌లో తలదాచుకుంటున్నారు. నాటి నుంచి ఆయనపైన నమోదైన అభియోగాలపై భారత్‌లో విచారణ కొనసాగుతోంది. ఆ క్రమంలోనే ఆయన్ను భారత్‌కు రప్పించేందుకు ప్రయత్నిస్తున్నారు.