రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నూతన గవర్నర్‌గా శక్తికాంత దాస్ నియమితులయ్యారు. ప్రస్తుత గవర్నర్ ఉర్జిత్ పటేల్ సోమవారం అనూహ్యంగా రాజీనా...
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నూతన గవర్నర్‌గా శక్తికాంత దాస్ నియమితులయ్యారు. ప్రస్తుత గవర్నర్ ఉర్జిత్ పటేల్ సోమవారం అనూహ్యంగా రాజీనామా చేసిన విషయం తెలిసిందే. వ్యక్తిగత కారణాలతో తాను ఈ పదవి నుంచి తప్పుకుంటున్నట్లు ఉర్జిత్ నిన్న ప్రకటించారు. ఆ మరుసటి రోజునే కొత్త గవర్నర్ ను ప్రభుత్వం నియమించింది.
తాత్కాలిక గవర్నర్‌గా, ప్రస్తుత డిప్యూటీ గవర్నర్లలో సీనియర్ అయిన విశ్వనాథ్‌ను నియమించే అవకాశాలున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే శక్తికాంతదాస్‌కు ఆ బాధ్యతలను అప్పగించారు.
ఐఏఎస్ అధికారి అయిన శక్తికాంత దాస్ గతంలో రెవెన్యూ, ఆర్థికశాఖ కార్యదర్శిగా పనిచేశారు. గతేడాది పదవీ విరమణ పొందిన అనంతరం 15వ ఆర్థిక కమిషన్‌ను సభ్యులుగా నియమితులయ్యారు.
గతంలో రిజర్వు బ్యాంకు బోర్డులో కూడా పనిచేసిన ఆయన జీ 20 లో భారత ప్రభుత్వ ప్రతినిధిగా వ్యవహరిస్తున్నారు. మోదీ ప్రభుత్వంలో, అంతకు ముందు యుపిఎ ప్రభుత్వంలో బడ్జెట్ క్రియాశీల పాత్ర వహించిన ఆయన ప్రధాని మోదీ రెండేళ్ల క్రితం పెద్ద నోట్లను రద్దు చేసిన సమయంలో గట్టిగా మద్దతు తెలపడం ద్వారా ప్రతిపక్షాల విమర్శలకు కూడా గురయ్యారు.
గతకొంతకాలంగా ఆర్‌బీఐ, కేంద్రం మధ్య విభేదాలు నెలకొన్న విషయం తెలిసిందే. వివాదం నేపథ్యంలో ఉర్జిత్ పటేల్ రాజీనామా చేస్తారని అప్పట్లో వార్తలు వినిపించాయి. అయితే ఇటీవల జరిగిన బోర్డు సమావేశంలో కేంద్రం, ఆర్‌బీఐ మధ్య రాజీ కుదిరినట్లు రిజర్వ్ బ్యాంక్ తెలిపింది. ఈ నేపథ్యంలో సోమవారం ఉర్జిత్‌పటేల్ రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.