దేశంలో అసహనం పెరిగిపోయిందని, భావ ప్రకటన స్వేచ్ఛకు భంగం కలుగుతోందని తరచూ గగ్గోలు పెట్టే కాంగ్రెస్ పార్టీకి ఈ చిత్రం మింగుడు పడటం...
దేశంలో అసహనం పెరిగిపోయిందని, భావ ప్రకటన స్వేచ్ఛకు భంగం కలుగుతోందని తరచూ గగ్గోలు పెట్టే కాంగ్రెస్ పార్టీకి ఈ చిత్రం మింగుడు పడటం లేదు.. 2019 జనవరి 11న విడుదల కానున్న 'ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్' చిత్రం వారికి కంటినిండా నిద్రను కరువు చేస్తోంది.. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ట్రైలర్ కాంగ్రెస్ లో కలకలం రేపింది.. మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ పై రూపొందిన ఈ సినిమాను ఆడనివ్వబోమని చిందులు తొక్కుతున్నారు. కొద్ది సంవత్సరాల క్రితం మన కళ్ల ముందు కదలాడిన మన్మోహన్ సర్కారును తెర మీద చూడబోతున్నాం..
'ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్' చిత్రంలో మన్మోహన్ సింగ్ పాత్రను ప్రముఖ నటుడు అనుపమ్ ఖేర్ పోషించారు..
ఈ సినిమాలో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక వద్రా పాత్రలు కూడా కనిపిస్తాయి.. కాంగ్రెస్ వారి బాధ అదే.. కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలోని యూపీఏ కూటమికి 2004 ఎన్నికల్లో మెజారిటీ వచ్చినా సోనియా ఎందుకు ప్రధాని పదవి చేపట్టలేదు అనే అంశం, సోకాల్డ్ గాంధీ కుటుంబం మన్మోహన్ ను అడ్డు పెట్టుకొని చేసిన ఘన కార్యాలు ఈ సినిమాలో ఎక్కడ చూపిస్తారోనని కాంగ్రెస్ నాయకులు బెంబేలెత్తిపోతున్నారట..
‘ మహాభారతంలో రెండు కుటుంబాలు ఉంటే, భారత్ లో ఒకే కుటుంబం ఉంది.. ఫ్యామిలీ డ్రామాలో డాక్టర్ సాబ్ బాధితుడు..’ అనే అక్షయ్ ఖన్నా డైలాగ్ కాంగ్రెస్ వారికి చెమటలు పట్టిస్తోంది. వాస్తవానికి 'ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్' అనే పుస్తకాన్ని సీనియర్ జర్నలిస్ట్ సంజయ్ బారు రచించారు. ఈయన అప్పట్లో మన్మోహన్ సింగ్ కు సలహాదారుగా పని చేశారు. ఈ సినిమాలో సంజయ్ బారు పాత్ర అక్షయ్ ఖన్నాదే..
1991లో ప్రధాని పీవీ నరసింహారావు ప్రముఖ ఆర్థికవేత్త అయిన డాక్టర్ మన్మోహన్ సింగ్ కు ఆర్థికమంత్రి పదవి ఇచ్చారు.. పీవీ హయంలో చేపట్టిన ఆర్థిక సంస్కరణలు దేశ ప్రగతిని మలుపు తిప్పాయి.. తర్వాత కాలంలో అనుకోని పరిస్థితుల్లో మన్మోహన్ దేశ ప్రధాని అయ్యారు.. కొద్ది రోజుల క్రితం జరిగిన ఓ కార్యక్రమంలో ‘ నేను యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్ మాత్రమే కాదు.. యాక్సిడెంటల్ ఆర్థిక మంత్రిని కూడా.. ’ అని చమత్కరించారు మన్మోహన్ సింగ్..
భావ ప్రకటనా స్వేచ్ఛ గురుంచి ఈ మధ్య కాలంలో గొప్పలు చెబుతున్నా కాంగ్రెస్ నాయకులు ఇప్పుడు 'ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్' చిత్రాన్ని అడ్డుకుంటామని, తమ పాలనలోని రాష్ట్రాల్లో ఆడనిచ్చేది లేదని హాహాకారాలు చేస్తున్నారు.. ఇది వారి ద్వంద్వ ప్రమాణాలను మరోసారి చాటి చెప్పుతోంది.. సో మనమంతా వచ్చే నెలలో యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్ చిత్రాన్ని చూడబోతున్నాం.. అప్పటి వరకూ ఆ చిత్రం ట్రైలర్ ను చూసి ఎంజాయ్ చేద్దాం..