Page Nav

HIDE

Grid

GRID_STYLE

Pages

latest

ఏ పి ఆర్ధిక పరిస్థితి దారుణంగా మారింది

ఆంధ్రప్రదేశ్‌ ప్రస్తుతం ఆర్ధిక వ్యవహారాల నిర్వహణ గందరగోళంగా ఉంది. ఆర్ధిక పరిస్థితి ఆందోళనకరంగా మారింది. జీతాల చెల్లింపు...


ఆంధ్రప్రదేశ్‌ ప్రస్తుతం ఆర్ధిక వ్యవహారాల నిర్వహణ గందరగోళంగా ఉంది. ఆర్ధిక పరిస్థితి ఆందోళనకరంగా మారింది. జీతాల చెల్లింపులకు వెతుక్కోవలసిన పరిస్థితులు నెలకొన్నాయి. ప్రస్తుతం దాదాపు అన్ని రకాల బిల్లుల చెల్లింపులను నిలిపి వేశారు. అప్పులకోసం ప్రభుత్వం నానా తంటాలు పడుతున్నది. వసూళ్లు మందగించడం, ఖర్చులు భారీగా పెరిగి పోవడంతో ఆర్ధిక నియంత్రణ పట్టాలు తప్పింది.
ఇప్పుడు ఓవర్‌డ్రాఫ్టుతో కాలం నెట్టుకొంటూ ప్రభుత్వం మనుగడ సాగిస్తున్నది. రిజర్వుబ్యాంకు నిల్వల్లో రాష్ట్రం ఇప్పటికే ఆదాయాన్ని మించి అదనపు నిధులు వాడుకుంది. ప్రస్తుత పరిస్థితి నుంచి ఎలా గట్టెక్కాలా? అని ఆర్థిక శాఖ అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు.
ఒకవైపు పెద్దమొత్తంలో చెల్లింపులు చేయాల్సి ఉంది. రాబడులు లేవు. ఇప్పటికే పరిమితికి మించి నిధులు వాడేశారు. చేబదుళ్లు, ట్రెజరీ బయానాలు సయితం దాటిపోయి అదనంగా రూ.450 కోట్లు  వాడేసుకున్నట్లయింది. దాదాపు వారం రోజులుగా రాష్ట్ర ఖజానా పరిస్థితి ఇలాగే ఉంది. రెండు నెలలుగా జీతాల చెల్లింపునాడే ఓవర్‌డ్రాఫ్టునకు వెళ్లక తప్పడం లేదని తెలుస్తున్నది. మరోవైపు అనధికారికంగా అన్ని బిల్లులూ నిలిపేశారు. ఏ చిన్న బిల్లు కూడా పాస్‌ చేయడానికి వీల్లేదన్న మౌఖిక ఆదేశాలు అమల్లో ఉన్నాయి.
ట్రెజరీలపై ఒక రకంగా పూర్తి స్థాయి ఆంక్షలు విధించినట్లే. నిజానికి ప్రస్తుతం బిల్లుల చెల్లింపు వ్యవహారాల పర్యవేక్షణ అంతా సీఎఫ్‌ఎంఎస్‌ చూస్తోంది. గతంలో రూ.కోటిలోపు బిల్లుల చెల్లింపు సులభంగానే అయ్యేవి. ఇప్పుడు అనధికారికంగా ఈ చిన్నచిన్న మొత్తాలు సయితం చెల్లింపులకు నోచుకోవడం లేదు. ఖజానా ఖాళీ కావడం, ఇప్పటికే రిజర్వుబ్యాంకు వద్ద ఓవర్‌డ్రాఫ్ట్‌కు వెళ్లడంతో ఈ పరిస్థితి ఏర్పడింది.
 ప్రస్తుతం ఆర్థిక శాఖ వద్ద రూ.8000 కోట్ల మేర బిల్లులు పెండింగులో ఉన్నాయని చెబుతున్నారు. ఇందులో జలవనరులశాఖ బిల్లులున్నాయి, వర్క్సు అండ్‌ ఖాతావి ఉన్నాయి. రైతులకు చెల్లించాల్సినవీ ఉన్నాయి. ఆదాయం ఏ మాత్రం లేదు. ఆర్థిక శాఖ చుట్టూ అనేక మంది బిల్లుల కోసం తిరుగుతూనే ఉన్నారు. జీతాలు, పింఛన్లు తప్ప ఇతరత్రా చెల్లింపులకు ఏ మాత్రం వీలు పడని పరిస్థితి కనిపిస్తోందని ఆర్థిక శాఖ అధికారులే చెబుతున్నారు.
ప్రస్తుతం రూ.450 కోట్ల వరకు ఓవర్‌డ్రాఫ్టు ఉండటంతో ఆ మొత్తంపై ఆరు శాతం వరకు వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. ఇప్పటికే దాదాపు ఏడు పనిదినాల వరకు ఈ ఓవర్‌డ్రాఫ్టు కొనసాగుతోంది. 14 పని దినాల్లో ఈ మొత్తాలు వడ్డీతో సహా సర్దుబాటు చేయాల్సి ఉంటుందని, లేకపోతే రిజర్వుబ్యాంకు నుంచి నిధులు నిలిచిపోతాయని చెబుతున్నారు.